HK Team On Virat Kohli: కోహ్లీకి హాంకాంగ్ టీమ్ స్పెషల్ గిఫ్ట్
సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉండే అభిమానుల ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
- By Naresh Kumar Published Date - 02:27 PM, Thu - 1 September 22

సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉండే అభిమానుల ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశాలతో సంబంధం లేకుండా కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం మ్యాచ్ లు వీక్షించే అభిమానులే కాదు ప్రత్యర్థి జట్లలో కూడా చాలా మంది ఆటగాళ్లు విరాట్ కు ఫ్యాన్సే. గతంలో ఎన్నోసార్లు ప్రత్యర్థి జట్ల ప్లేయర్స్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన సందర్భాలు చాలానే చూశాం. తాజాగా కోహ్లీకి హాంకాంగ్ టీమ్ ఓ ప్రత్యేక బహుమతి పంపించింది. ఆసియాకప్ లో భాగంగా బుధవారం భారత్ , హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత హాంకాంగ్ జట్టు విరాట్ కు ఓ స్పెషల్ జెర్సీ పంపింది. దీనిపై ఓ స్పెషల్ మెసేజ్ కూడా వాళ్లు రాశారు.
ఓ తరానికి స్ఫూర్తిగా నిలిచినందుకు థ్యాంక్యూ. మేము నీతోనే ఉంటాము. రానున్నవి చాలా అద్భుతమైన రోజులు. ప్రేమతో టీమ్ హాంకాంగ్ అనే సందేశాన్ని ఆ జెర్సీపై రాసి మ్యాచ్ తర్వాత కోహ్లికి అందించారు. ఈ స్పెషల్ గిఫ్ట్‌పై ఎంతో ఆనందం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లి.. తర్వాత ఆ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. మీ ఆత్మీయతకు ధన్యవాదాలు. వెరీ వెరీ స్వీట్ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు. తాజాగా ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా కాలంగా ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీకి పలువురు విదేశీ ఆటగాళ్లు మద్ధతుగా నిలిచారు. ప్రస్తుతం ఆసియాకప్ లో ఫామ్ లోకి వచ్చినట్టే కనిపిస్తున్నాడు. పాక్ పై 35 రన్స్ చేసిన విరాట్ తాజాగా హాంకాంగ్ పై హాఫ్ సెంచరీ చేశాడ.
A special gift to Virat Kohli by the Hong Kong team – Kohli is truly the face of modern Era. pic.twitter.com/s7Ldu0mNLA
— Johns. (@CricCrazyJohns) September 1, 2022