Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..!
- Author : Vamsi Chowdary Korata
Date : 11-06-2026 - 12:20 IST
Published By : Hashtagu Telugu Desk
వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘ఆఫ్ఘనిస్థాన్-ఏ’తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల ఈ ఓపెనర్ కేవలం 22 బంతుల్లోనే 44 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే అర్ధ శతకానికి చేరువవుతున్న తరుణంలో ఒక బౌన్సర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు.
ఐపీఎల్ ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు వైభవ్‌పై అమలు చేసిన వ్యూహాన్ని ఆఫ్ఘనిస్థాన్ కూడా అనుసరించింది. ఆఫ్‌స్టంప్ బయట బౌన్సర్ బంతులతో అతణ్ణి పరీక్షించే ప్రయత్నం చేసింది. అబ్దుల్లా అహ్మద్‌జాయ్ అదే ప్లాన్‌తో బౌలింగ్ చేశాడు. ముందుగా ఒకసారి ఎడ్జ్ రాబట్టిన అతడు, తర్వాత కూడా అదే ప్రాంతంలో బంతులు వేస్తూ వైభవ్‌ను దొరకబుచ్చుకునే ప్రయత్నం చేశాడు.
చివరకు అదే జరిగింది. ఆఫ్‌స్టంప్ బయటకు వెళ్లిన బౌన్సర్‌ను ఆడబోయిన వైభవ్ బ్యాట్ అంచుకు తగిలి వికెట్‌కీపర్ చేతికి చిక్కాడు. ఔటైన వెంటనే తనపై తనకే కోపం వచ్చినట్లు అసహనాన్ని ప్రదర్శించాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ బ్యాటింగ్‌లో మరో కోణం కూడా కనిపించింది. తను కేవలం భారీ షాట్లకే పరిమితం కాదని నిరూపించాడు. ఆఫ్ఘన్ బౌలర్లు ఆఫ్‌సైడ్‌లో ఫీల్డర్లను పెంచినా అనవసరంగా షాట్లు ఆడకుండా గ్యాప్‌లు వెతుక్కుంటూ చక్కటి టైమింగ్‌తో బౌండరీలు సాధించాడు.
ముఖ్యంగా కవర్ ప్రాంతంలో వైభవ్ ఆడిన కొన్ని షాట్లు ప్రత్యేకంగా నిలిచాయి. బంతి దగ్గరకు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూసి చివరి క్షణంలో గ్యాప్‌లోకి పంపించిన తీరు ఆకట్టుకుంది. హాఫ్ సెంచరీ చేయకపోయినా ఈ ఇన్నింగ్స్, వైభవ్ ఎంత వేగంగా నేర్చుకుంటున్నాడో చూపించింది. బౌలర్లు అతణ్ణి అడ్డుకునేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో అతడు కూడా తన ఆటలో కొత్త కోణాలను జోడిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.