వైభవ్ సూర్యవంశీ మరో సరికొత్త రికార్డు
- Author : Vamsi Chowdary Korata
Date : 06-01-2026 - 2:23 IST
Published By : Hashtagu Telugu Desk
Vaibhav Suryavanshi యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బెనోని వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది.. యూత్ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 2016లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ నమోదు రికార్డును బద్దలు కొట్టాడు వైభవ్ సూర్యవంశీ.
- చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
- 15 బంతుల్లో హాఫ్ సెంచరీ
- యూత్ వన్డేల్లో సరికొత్త రికార్డ్..
ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది.. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు 14 ఏళ్ల సూర్యవంశీ. తాజాగా 2026 సవంత్సరాన్ని అత్యద్భుతంగా ప్రారంభించాడు. మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో మూడు యూత్ వన్డే సిరీస్‌లో భాగంగా బెనోని వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో.. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో యూత్ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ శకతం సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు వైభవ్ సూర్యవంశీ.
యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇప్పటి వరకు టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ పేరు మీద ఉండేది. దాదాపు 8 ఏళ్లు ఈ రికార్డును ఎవరూ ఛేదించలేకపోయారు. పంత్ 2016 అండర్ 19 ప్రపంచ కప్‌లో ఢాకా వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో.. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్‌తో యూత్ వన్డేలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా రిషబ్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తంగా 24 బంతుల్లో ఒక ఫోర్, 10 సిక్సులతో 68 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కాగా, కెప్టెన్ ఆయుశ్ మాత్రే మ్యాచ్‌కు దూరమైన నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ విజయంలో వర్షం కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేలోనూ అదే విధంగా జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 49.3 ఓవర్లలో 245 పరుగులు చేసింది. అయితే వర్షణం కారణంగా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా మ్యాచ్‌ను కుదించారు. 27 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ నాలుగు ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యనం నెలకొల్పారు. వైభవ్ సూర్యవంశీ 10 సిక్సులతో రెచ్చిపోయాడు.
సూర్యవంశీ ఔట్ అయ్యే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 10 ఓవర్లలోనే భారత్ 103 పరుగులు చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా వేదాంత్ త్రివేది (31*), అభిజ్ఞాన్ కుందు (48*) ఇన్నింగ్స్ పూర్తి చేశారు. ఇక సౌతాఫ్రికా బౌలర్ మైకెల్ క్రిష్‌క్యాంప్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా విజయం సాధించింది. ప్రస్తుతం 2-0 తేడాతో సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. అండర్ 19 వరల్డ్ కప్ ముందు ఈ సిరీస్ భారత్, దక్షిణాఫ్రికాకు సన్నాహకంగా ఉపయోగపడుతోంది.