ఐపీఎల్లో జీతం భారీగా పెరిగిన టాప్-5 ఆటగాళ్లు వీరే!
శ్రీలంక పేసర్ మతీషా పతిరాణను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు రికార్డు ధరతో కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక శ్రీలంక ఆటగాడికి లభించిన అత్యధిక ధర ఇదే.
- Author : Gopichand
Date : 18-12-2025 - 11:29 IST
Published By : Hashtagu Telugu Desk
- ఐపీఎల్లో భారీగా జీతం పెరిగిన ఆటగాళ్ల లిస్ట్ ఇదే
- ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో 77 మంది ఆటగాళ్లు సోల్డ్
IPL 2026: అబుదాబీలోని ఎతిహాద్ అరీనాలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో మొత్తం 77 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. 10 ఫ్రాంచైజీలు కలిసి ఆటగాళ్ల కోసం సుమారు 215 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాయి. ఈ వేలంలో కెమెరూన్ గ్రీన్, మతీషా పతిరాణ, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచారు.
అయితే కొందరు ఆటగాళ్లు అత్యధిక ధర దక్కించుకోకపోయినా, గత సీజన్‌తో పోలిస్తే వారి జీతంలో భారీ పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్ ఆదాయం ఏకంగా 230 శాతం పెరిగింది. గత సీజన్ కంటే ఈసారి ఎక్కువ జీతం పొందుతున్న ఆ ఐదుగురు ఆటగాళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Also Read: ఇక పై అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. లోక్‌సభలో ‘శాంతి ’ బిల్లుకు ఆమోదం
జీతం భారీగా పెరిగిన టాప్-5 ఆటగాళ్లు
జోష్ ఇంగ్లిస్- 230% పెరుగుదల
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 8.60 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ ఇతడిని రూ. 2.60 కోట్లకు దక్కించుకుంది. అంటే ఇతని జీతం 230.76% పెరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంగ్లిస్ మొదటి రౌండ్లో అమ్ముడుపోలేదు. అంతేకాకుండా 2026 సీజన్లో అతను కేవలం 4 మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే అతనికి నగదు అందుతుంది. కానీ 2027 సీజన్లో పూర్తి జీతం పొందే అవకాశం ఉంది.
రాహుల్ చాహర్- 62% పెరుగుదల
టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా మొదటి రౌండ్లో అమ్ముడుపోలేదు. కానీ రెండోసారి వేలంలోకి వచ్చినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5.20 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతడికి రూ. 3.20 కోట్లు చెల్లించింది. ఇప్పుడు ఇతని ఆదాయం 62% పెరిగింది.
ముస్తాఫిజుర్ రెహ్మాన్ – 53.33% పెరుగుదల
బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కోసం మొదటి రౌండ్లోనే తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.20 కోట్లకు ఇతడిని దక్కించుకుంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఇంజూరీ రీప్లేస్‌మెంట్‌గా చేరిన ఇతని జీతం రూ. 6 కోట్లు. ఇప్పుడు అది 53.33% పెరిగింది.
లియామ్ లివింగ్‌స్టోన్ – 48.57% పెరుగుదల
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ మొదటి రౌండ్లో అమ్ముడుపోకపోయినా, రెండోసారి ఊహించని ధర పలికాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్లకు ఇతడిని సొంతం చేసుకుంది. గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉన్నప్పుడు ఇతని జీతం రూ. 8.75 కోట్లు. ఇప్పుడు అది 48.57% పెరిగింది.
మతీషా పతిరాణ – 38.46% పెరుగుదల
శ్రీలంక పేసర్ మతీషా పతిరాణను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు రికార్డు ధరతో కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక శ్రీలంక ఆటగాడికి లభించిన అత్యధిక ధర ఇదే. 2025 మెగా వేలానికి ముందు ఇతడిని సిఎస్కె రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పుడు మినీ వేలంలో ఇతని జీతం 38.46% పెరిగింది.