Shubman Gill : టీమిండియా ఓటమి పై స్పందించిన శుభమన్ గిల్!
- By Vamsi Chowdary Korata Published Date - 10:09 AM, Thu - 27 November 25
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయంపై శుభమన్ గిల్ స్పందించాడు. మెడ గాయంతో జట్టుకు దూరమైన గిల్, సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయక పోస్ట్ చేశాడు. అందరం కలిసికట్టుగా పోరాడి భవిష్యత్‌లో మరింత ముందుకు వెళ్లాలని గిల్ పిలుపునిచ్చాడు. గాయం నుంచి కోలుకుంటున్న గిల్, దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
Calm seas don’t teach you how to steer, it’s the storm that forges steady hands. We’ll continue to believe in each other, fight for each other, and move forward – rising stronger. 🇮🇳
— Shubman Gill (@ShubmanGill) November 26, 2025
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈడెన్ గార్డెన్స్‌లో 30 పరుగుల తేడాతో ఓటమిపాలయిన భారత్, గువాహటిలో దారుణంగా 400కు పైగా పరుగులతో ఓడిపోయింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురైంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనే మెడ గాయంతో జట్టుకు దూరమైన శుభమన్ గిల్ .. ఈ ఘోర పరాభవంపై స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు.
శుభమన్ గిల్ తన ఎక్స్ అకౌంట్‌లో “నిశ్శబ్దంగా ఉండే సముద్రాలు మనకు ఏమీ నేర్పవు.. అక్కడ పుట్టించే తుఫానే మనల్ని స్ట్రాంగ్‌గా తయారు చేస్తుంది. మనం ఒకరిపై ఒకరం నమ్మకం ఉంచి, కలిసి పోరాడుతూ మరింత బలంగా ముందుకు వెళ్దాం” ఇలా పోస్ట్ చేశాడు. టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న శుభమన్ గిల్ భవిష్యత్ టోర్నీలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
మొదటి టెస్ట్ రెండో రోజు గిల్‌కు తీవ్రమైన మెడ నొప్పి రావడంతో వెంటనే కోల్‌కతాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మ్యాచ్ మిగతా భాగం గిల్ ఆడలేకపోయాడు. ఒక రోజు తర్వాత డిశ్చార్జ్ అయినా, పూర్తిగా కోలుకోకపోవడంతో గువాహటి టెస్ట్‌కు అందుబాటులో లేడు. గిల్ ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి జట్టుతో గువాహటి వెళ్లినా, ప్రాక్టీస్ సెషన్‌కు మాత్రం దిగలేదు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు గిల్ ఇప్పటికే తప్పుకోగా, టీ 20 సిరీస్‌కూ అనుమానమే అని తెలుస్తోంది.
ఇది కండం సమస్య అవుతుందా లేదా నరాలకు సంబంధ సమస్యా అన్నది పరీక్షల ద్వారా క్లియర్ అవుతుంది. అతను వచ్చే టీ20 సిరీస్‌కు ఫిట్ అవుతాడని ఆశిస్తున్నాం ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. మరొక నివేదిక ప్రకారం, గిల్ ముంబైకి చెందిన స్పైన్ స్పెషలిస్ట్ డాక్టర్ అభయ్ నేనేను కలుసుకున్నాడు. రిపోర్ట్‌ను సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌కు పంపించాడు. గిల్‌కు నొప్పి తగ్గేందుకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు కొంత విశ్రాంతి, తర్వాత రిహ్యాబ్, ట్రైనింగ్ అవసరం. వచ్చే టీ20 సిరీస్‌కు అనుమానమే మరో బీసీసీఐ అధికారి వెల్లడించాడు.