Womens World Cup Anthem: మహిళల వరల్డ్ కప్ 2025.. శ్రేయా ఘోషల్ పాడిన పాటను విడుదల చేసిన ఐసీసీ!
ఈ టోర్నమెంట్‌లో భారత్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. ఐసీసీ ఈసారి విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని పెంచింది. ఛాంపియన్ జట్టుకు 13.88 మిలియన్ల అమెరికన్ డాలర్లు లభిస్తాయి.
- By Gopichand Published Date - 01:55 PM, Fri - 19 September 25

Womens World Cup Anthem: భారత్- శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తన గానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ఈవెంట్ కోసం ఆమె తన మధురమైన గొంతుతో పాడిన అధికారిక పాట (Womens World Cup Anthem) “బ్రింగ్ ఇట్ హోమ్”ను ఐసీసీ విడుదల చేసింది. ఐసీసీ ఈ పాట వీడియోను తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ “తారికీట తారికీట ధోమ్, ధక్ ధక్..” అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పాట క్రికెట్ మైదానంలో అడుగుపెట్టిన ప్రతి మహిళా క్రికెటర్ ఆశయాలు, కష్టాలు, కలలను ప్రతిబింబిస్తుంది.
పాట మొత్తం శక్తి, ఉత్సాహంతో నిండి ఉంది. తారికీట తారికీట తారికీట ధోమ్, ధక్ ధక్, వి బ్రింగ్ ఇట్ హోమ్ వంటి ఆకర్షణీయమైన పదాలతో కూడిన ఈ పాట మహిళల బలం, కలలు, ధైర్యానికి అంకితం చేయబడింది. పాటలో “పత్థర్ పిఘలానా హై, ఏక్ నయా ఇతిహాస్ బనానా హై” (రాళ్లను కరిగించాలి, ఒక కొత్త చరిత్రను సృష్టించాలి) అనే పంక్తి మహిళల సంకల్పాన్ని తెలియజేస్తుంది. ఈ పాట స్పాటిఫై, ఆపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, జియోసావన్, యూట్యూబ్ మ్యూజిక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
శ్రేయా ఘోషల్ సంతోషం
ఈ పాట గురించి శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. మహిళల క్రికెట్ స్ఫూర్తి, శక్తి, ఐక్యతను చాటిచెప్పే ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025లో అధికారిక పాటలో భాగం కావడం అద్భుతమైన అనుభవం. క్రీడల పట్ల ప్రేమతో ప్రజలను ఏకం చేసే ఈ క్షణంలో నా వంతుగా గొంతు అందించడం నాకు గర్వంగా ఉంది. ఈ పాట అభిమానులను ప్రేరేపిస్తుంది. ఈ ఉత్సాహభరితమైన టోర్నమెంట్‌ను జరుపుకుంటూ గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టిస్తుందని నేను ఆశిస్తున్నాను అని అన్నారు.
Also Read: Indian Techie Dead: అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి!
Sing it with us 🎵
Tarikita Tarikita dhom… dhak dhak! 🥁
The #CWC25 event song ft. @shreyaghoshal is OUT NOW 🤩 pic.twitter.com/1Bw6O5DhgF
— ICC (@ICC) September 19, 2025
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 వివరాలు
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 శ్రీలంక, భారత్‌లలో జరగనుంది. మొత్తం 8 దేశాలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ నవంబర్ 3 వరకు కొనసాగుతుంది. ప్రపంచ కప్‌లో చాలా మ్యాచ్‌లు భారత్‌లో జరుగుతాయి. అయితే పాకిస్థాన్ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది.
పోటీలో ఉన్న 8 జట్లు
ఈ టోర్నమెంట్‌లో భారత్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. ఐసీసీ ఈసారి విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని పెంచింది. ఛాంపియన్ జట్టుకు 13.88 మిలియన్ల అమెరికన్ డాలర్లు లభిస్తాయి.