Kolkata Knight Riders: కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ 16వ సీజన్ లో ఓటమితో శుభారంభం చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కింగ్స్‌పై ఓటమి తర్వాత సోమవారం (ఏప్రిల్ 3) జట్టుకు బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
- By Gopichand Published Date - 07:15 AM, Tue - 4 April 23

ఐపీఎల్ 16వ సీజన్ లో ఓటమితో శుభారంభం చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కింగ్స్‌పై ఓటమి తర్వాత సోమవారం (ఏప్రిల్ 3) జట్టుకు బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్ వెటరన్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇంకా జట్టులో చేరలేదు. బంగ్లాదేశ్ నుంచే కోల్‌కతా టీమ్ మేనేజ్‌మెంట్‌తో షకీబ్ మాట్లాడి తన నిర్ణయాన్ని వివరించాడు.
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ ఈ సీజన్‌కు అందుబాటులో లేనట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి అధికారికంగా తెలియజేశాడు. అంతర్జాతీయ కట్టుబాట్లు, వ్యక్తిగత కారణాల వల్ల అతను లీగ్ నుండి వైదొలిగినట్లు భావిస్తున్నారు. ఈసారి వేలంలో షకీబ్‌ను కోల్‌కతా రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కోసం ఏ ఇతర జట్టు కూడా వేలం వేయలేదు. మరో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ కోల్‌కతా జట్టులో చేరలేదు. ఈ వారం చివరి నాటికి అతడు జట్టులోకి వస్తాడని ఫ్రాంచైజీ ఆశాభావం వ్యక్తం చేసింది.
షకీబ్ విషయానికి వస్తే.. 36 ఏళ్ల అతను స్వచ్ఛందంగా తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఐపిఎల్ నిబంధనల ప్రకారం.. ఫ్రాంచైజీ ఎవరినీ మిడ్-సీజన్ నుంచి విడుదల చేయదు. దీంతో షకీబ్ జట్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో అతను తన పేరును ఉపసంహరించుకోవలసి వచ్చింది. దింతో షకీబ్ ప్లేస్ లో మరో విదేశీ ఆటగాడిని తీసుకోవాలని కోల్ కతా భావిస్తుంది. అందుకు షకీబ్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
Also Read: CSK vs LSG: చెపాక్ లో చెన్నై చెడుగుడు.. లక్నో పై విజయం
షకీబ్, లిటన్ దాస్‌లను విడుదల చేసేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించిన సంగతి తెలిసిందే. మిర్పూర్‌లో జరిగే టెస్టుకు ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. మార్చి 31న పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు జట్టులోకి వస్తారని ఫ్రాంచైజీ భావించింది. 50 లక్షలకు కోల్‌కతా లిటన్‌ను కొనుగోలు చేసింది.
2011లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన షకీబ్ అల్ హసన్ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 71 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 52 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన అతను 19.82 సగటుతో, 124.49 స్ట్రైక్ రేట్‌తో 793 పరుగులు చేశాడు. అదే సమయంలో బౌలింగ్‌లో షకీబ్ అల్ హసన్ 70 ఇన్నింగ్స్‌లలో 29.19 సగటుతో మొత్తం 63 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 65 టెస్టులు, 230 వన్డేలు, 115 టీ20 ఇంటర్నేషనల్‌లు ఆడాడు. షకీబ్ మూడు ఫార్మాట్లలో అంటే అంతర్జాతీయ కెరీర్‌లో బ్యాటింగ్ చేస్తూ 13798 పరుగులు చేశాడు. అదే సమయంలో బౌలింగ్‌లో 668 వికెట్లు తీశాడు.