Sanjay Bangar: టీమిండియా భవిష్యత్తు వాళ్లిద్దరే!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికారు. త్వరలో టెస్టులకు కూడా గుడ్ బై చెప్పనున్నారు. ఫిట్నెస్ సరిగా ఉంటే నెక్స్ట్ వన్డే ప్రపంచ కప్ వరకు ఆడే పరిస్థితి ఉంది.
- By Naresh Kumar Published Date - 07:00 PM, Thu - 30 January 25

Sanjay Bangar: ప్రపంచ క్రికెట్‌లో లెజెండ్స్ పుడుతూనే ఉంటారు. ఒక్కో జనరేషన్ లో ఒక్కో ఆటగాడు ప్రపంచ క్రికెట్ని శాసిస్తుంటాడు. ప్రస్తుతం టీమిండియాలో కొనసాగుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనంతరం ఎవరని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అంతలా ఈ స్టార్ ఆటగాళ్లు ప్రభావితం చూపారు. సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్ , గంగూలీ అనంతరం ధోనీ వచ్చాడు. ధోనీ ఒక్కడే దశాబ్దకాలంగా జట్టును నడిపించాడు. ధోనీ అనంతరం విరాట్, కోహ్లీ, రోహిత్ శర్మ టీమిండియా బాధ్యతను నెత్తినేసుకుని సక్సెస్ ఫుల్ గా ఇక్కడివరకు తీసుకొచ్చారు. అయితే రోహిత్, కోహ్లీ శకం చివరి దశకు చేరింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికారు. త్వరలో టెస్టులకు కూడా గుడ్ బై చెప్పనున్నారు. ఫిట్నెస్ సరిగా ఉంటే నెక్స్ట్ వన్డే ప్రపంచ కప్ వరకు ఆడే పరిస్థితి ఉంది. మరి ఆ తరువాత జట్టు బాధ్యతలను తీసుకునేదెవరు అన్న ప్రశ్నపై టీమిండియా దిగ్గజాలు యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్ పేర్లను సూచిస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ షో డీప్ పాయింట్’లో పాల్గొన్న సంజయ్ మంజ్రేకర్ మరియు సంజయ్ బంగర్ (Sanjay Bangar)లు టీమిండియా భవిష్యత్తుపై చర్చించారు. ఈ క్రమంలో వారిద్దరూ జైస్వాల్, గిల్ లను రోహిత్, కోహ్లీతో పోల్చారు. భవిష్యత్తులో టీమిండియాను నడిపించేది వీరిద్దరేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గిల్, యశస్వి టాప్ ఆర్డర్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు. వీళ్లిద్దరు మైదానంలో కుదురుకుంటే ఎక్కువ పరుగులు సాధించే అవకాశం లభిస్తుంది.
Also Read: RCB: ఆర్సీబీకి కష్టాలు తప్పవా.. ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ
జైస్వాల్, గిల్ ఇద్దరూ తమ అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. అయితే యశస్వి జైస్వాల్ ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ఇప్పటివరకు యశస్వి 23 టి20 మ్యాచ్‌ల్లో 723 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని కథలో ఒక సెంచరీ మరియు 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యశస్వి 2023లో టెస్ట్ అరంగేట్రం చేసి19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలతో సహా 1798 పరుగులు చేశాడు.