Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!
- By Vamsi Chowdary Korata Published Date - 11:50 AM, Mon - 3 November 25
దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ ఓటమిపై స్పందించింది. భారత్ పై జరిగిన ఈ పోరులో జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉన్నా, ఈ ఓటమి ఒక పెద్ద పాఠమని తెలిపింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన వోల్వార్ట్ సెంచరీతో ఆకట్టుకుంది. అదేవిధంగా సీనియర్ ప్లేయర్ మారిజానే కాప్ రిటైర్మెంట్‌పై కూడా మాట్లాడింది. ఈ టోర్నమెంట్ తమకు ఎన్నో అనుభవాలను ఇచ్చిందని ఆమె తెలిపింది.
దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ తన జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉందని, భారత్ చేతిలో ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తమ జట్టుకు పెద్ద పాఠమని పేర్కొంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత్ చేతిలో 52 పరుగుల తేడాతో ఓడినా, తమ జట్టు కృషిపై గర్వంగా ఉందని ఆమె తెలిపింది. అదే సమయంలో జట్టు సీనియర్ ప్లేయర్ మారిజానే కాప్ ఇకపై జట్టుకు దూరమవుతున్నారని ప్రకటించింది.
వోల్వార్ట్ మాట్లాడుతూ మా జట్టు ప్రదర్శనపై నాకు గర్వంగా ఉంది. మొత్తం టోర్నమెంట్‌లో అద్భుతమైన క్రికెట్ ఆడాం. కానీ ఈ రోజు భారత్ మమ్మల్ని మించిపోయింది. ఫలితంగా ఓడినా, ఇది మాకు ఒక నేర్చుకునే అవకాశంగా ఉంటుంది. మధ్యలో కొన్ని మ్యాచ్‌ల్లో తప్పిదాలు జరిగాయి కానీ మేము వాటిని అధిగమించి తిరిగి బలంగా నిలబడ్డాం. మా జట్టు ప్రదర్శనలో ఉన్న పట్టుదల, పోరాటస్ఫూర్తిపై చాలా సంతోషంగా ఉంది” అని చెప్పింది.
ప్రపంచకప్ ప్రారంభానికి ముందు నా ఫామ్ బాగాలేదు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో కూడా బాగా ఆడలేకపోయాను. అప్పట్లో చాలా ఆలోచించాను, కానీ తర్వాత ఒక విషయం గ్రహించాను. ఇది కేవలం మరో క్రికెట్ మ్యాచ్ మాత్రమే. కెప్టెన్సీని, బ్యాటింగ్‌ను వేర్వేరుగా తీసుకుంటేనే సహజ ఆట ఆడగలనని తెలుసుకున్నాను. ఆ తర్వాతే నా ఆటలో స్వేచ్ఛ, నమ్మకం తిరిగి వచ్చింది” అని వివరించింది.
మ్యాచ్ పరిస్థితులపై మాట్లాడుతూ ఆమె బంతి కొంచెం స్వింగ్ అవుతుందని భావించామని, కానీ అలా జరగలేదనింది. మొదట బౌలింగ్ చేయాలన్న నిర్ణయం తప్పు కాదని, కీలక సమయంలో ఎక్కువ వికెట్లు కోల్పోవడంతోనే మ్యాచ్ ఓడిపోయామని చెప్పింది. షఫాలీ వర్మ అద్భుతంగా ఆడిందని ప్రశంసించింది.
జట్టు సీనియర్ ప్లేయర్ మారిజానే కాప్ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ ఆమె ఎన్నో ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికాకు అద్భుతమైన సేవలు అందించింది. ఆమె చివరి ప్రపంచకప్ ఇదే అవుతుందని తెలుసుకోవడం బాధాకరం. మొత్తం జట్టు ఆమె కోసం గెలవాలని కోరుకుంది అని తెలిపింది.
వోల్వార్ట్ ఈ ప్రపంచకప్‌లో వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్లో 98 బంతుల్లో 101 పరుగులు సాధించి, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది. మొత్తం 9 ఇన్నింగ్స్‌లలో 571 పరుగులు సాధించి 71.37 సగటుతో తన ప్రతిభను చాటింది. ఆమె ప్రపంచకప్ కెరీర్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌ల్లో 1,328 పరుగులు సాధించింది. ఇందులో రెండు శతకాలు, 12 అర్థశతకాలు ఉన్నాయి. దీంతో ఆమె న్యూజిలాండ్ లెజెండ్ డెబీ హాక్లీ 1,501 పరుగుల రికార్డుకు అత్యంత సమీపంలో ఉంది. అంతేకాకుండా మహిళల ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక 50+ స్కోర్లు 14 సార్లు సాధించిన ప్లేయర్‌గా కొత్త రికార్డు సృష్టించింది.