IPL: లో స్కోరింగ్ మ్యాచ్ లో బెంగళూర్ విజయం
- By Naresh Kumar Published Date - 10:47 AM, Thu - 31 March 22

ఐపీఎల్ లో మరో ఉత్కంఠ మ్యాచ్ అభిమానులను అలరించింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా ఆరంభం నుంచీ తడబడింది. ప్రధాన బ్యాటర్ ల్లో ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేదు.పవర్‌ప్లే ముగిసేసరికే వెంకటేశ్ అయ్యర్ 10, రహానే 9 , నితీశ్ రాణా 10 పెవిలియన్ చేరగా, తర్వాతి ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ 13 రన్స్ కే వెనుదిరిగాడు.
తన తొలి ఓవర్లోనే శ్రేయస్‌ను అవుట్ చేసిన హసరంగ, తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో నరైన్ షెల్డన్ జాక్సన్ నూ ఔట్ చేశాడు. రసెల్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా, బిల్లింగ్స్ కూడా విఫలం కావడం కేకేఆర్‌ను దెబ్బ తీసింది. దీంతో కేకేఆర్ 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ (18 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు)దే అత్యధిక స్కోరు. వనిందు హసరంగ నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, ఆకాశ్‌దీప్ 3, హర్షల్ 2 వికెట్లు తీశారు. చివర్లో ఉమేశ్ యాదవ్ 18పరుగులు జోడించడంతో కనీస స్కోరు నమోదైంది.
కాగా తన 4 ఓవర్లలో 2 మెయిడిన్‌లు వేసిన పేసర్ హర్షల్ పటేల్… ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఛేదనలో బెంగళూరు ఇన్నింగ్స్ కూడా గొప్పగా సాగలేదు. తొలి మూడు ఓవర్లలో వరుసగా రావత్ , డుప్లెసిస్ 5, కోహ్లి వెనుదిరిగారు. విల్లీ కూడా ప్రభావం చూపలేకపోయాడు. రూథర్‌ఫర్డ్ బాగా నెమ్మదిగా ఆడగా… షహబాజ్ అహ్మద్ (20 బంతుల్లో 27 రన్స్ చేయడం బెంగళూరుకు కాస్త ఊపు తెచ్చింది. చివర్లో 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ పెరిగినా… దినేశ్ కార్తీక్ (14 నాటౌట్), హర్షల్ పటేల్ (10 నాటౌట్) జాగ్రత్తగా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా మ్యాచ్‌ను ముగించారు.