Rishabh Pant: రిషబ్ పంత్‌కు మెటాటార్సల్ గాయం.. మాంచెస్టర్ టెస్ట్‌కు కష్టమేనా?
పంత్‌ను మైదానం నుండి గోల్ఫ్ కార్ట్‌తో తీసుకెళ్లిన విధానం చూస్తే అతను ఈ మ్యాచ్‌లో తిరిగి ఆడగలడని అనిపించడం లేదు. అయితే, BCCI నుంచి అతని గాయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
- By Gopichand Published Date - 01:59 PM, Thu - 24 July 25

Rishabh Pant: మాంచెస్టర్‌లో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ (Rishabh Pant)కు మెటాటార్సల్ గాయం అయినట్లు తెలుస్తోంది. అతని గాయంపై పూర్తి అప్‌డేట్ ఇంకా రాలేదు. కానీ అతను ఈ మ్యాచ్‌లో తిరిగి ఆడటం అనుమానమే. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పంత్‌కు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని తెలుస్తోంది.
మెటాటార్సల్ గాయం అంటే ఏమిటి?
మెటాటార్సల్ గాయం అనేది పాదాల ముందు భాగంలో ఉండే ఎముకలకు సంబంధించినది. మన పాదంలో ఐదు పొడవైన ఎముకలను మెటాటార్సల్స్ అంటారు. ఇవి మన కాలు చివర, చీలమండ నుండి కాలి వేళ్ళ వరకు ఉంటాయి. ఈ ఎముకలు మనం నడవడానికి, పరుగెత్తడానికి, నిలబడటానికి చాలా ముఖ్యమైనవి. రిషభ్ పంత్‌కు కుడి పాదంపై బంతి తగలడంతో అతను వెంటనే నొప్పిగా భావించి మైదానంలో పడిపోయాడు. అతను తన కుడి పాదంపై బరువు మోపలేకపోయాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా గతంలో తనకు మెటాటార్సల్ గాయం అయ్యిందని, అవి చిన్నవిగా, సున్నితమైన ఎముకలని పేర్కొన్నారు.
Also Read: HHVM : ‘హరి హర వీరమల్లు’ లో ప్రధానంగా నిరాశ పరిచినవి ఇవే !!
Rishabh Pant is driven off the field of play after suffering some severe swelling on his right foot and Ravindra Jadeja walks out to the middle… 🩹 pic.twitter.com/vJlu5CABQ8
— Sky Sports Cricket (@SkyCricket) July 23, 2025
రిషభ్ పంత్ తిరిగి ఆడుతాడా?
పంత్‌ను మైదానం నుండి గోల్ఫ్ కార్ట్‌తో తీసుకెళ్లిన విధానం చూస్తే అతను ఈ మ్యాచ్‌లో తిరిగి ఆడగలడని అనిపించడం లేదు. అయితే, BCCI నుంచి అతని గాయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ప్రస్తుతం అతను వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. గాయపడక ముందు పంత్ 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మను అధిగమించి రెండో స్థానంలో నిలిచాడు. అభిమానులు పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
రిషబ్ పంత్ సరికొత్త రికార్డు
రిషబ్ పంత్ ఇంగ్లాండ్‌పై 1000 టెస్టు పరుగులు పూర్తి చేసుకుని అరుదైన రికార్డును సాధించాడు. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టు తొలిరోజు బ్యాటింగ్‌లో పంత్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ రికార్డును అతను ఒక సిక్స్‌తో అందుకోవడం విశేషం. ఈ ఘనతతో పంత్ ఇంగ్లాండ్ గడ్డపై 1000 టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న తొలి విజిటింగ్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.