Rajasthan Royals: డగౌట్లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.
- Author : Vamsi Chowdary Korata
Date : 13-04-2026 - 12:15 IST
Published By : Hashtagu Telugu Desk
నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ సమయంలో డగౌట్లో ఫోన్ వాడిన ఘటనలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌పై బీసీసీఐ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్‌యూ) ఆయనకు నోటీసులు జారీ చేసింది.
శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డగౌట్లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పక్కన కూర్చున్న భిందర్, తన ఫోన్‌ను ఉపయోగిస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యాంటీ కరప్షన్ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఏసీఎస్యూను ఆదేశించినట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. నోటీసు అందుకున్న 48 గంటల్లోగా తన వాదన వినిపించాలని భిందర్‌ను ఆదేశించారు.
అయితే, ఈ వివాదం వెనుక భిందర్ అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడి, నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో సుదీర్ఘకాలం చికిత్స పొందారని సమాచారం. దీనికి తోడు ఆయనకు ఆస్తమా కూడా ఉందని, ఎక్కువ దూరం నడవటం, మెట్లు ఎక్కడం వంటివి చేయవద్దని వైద్యులు సూచించినట్లు ఫ్రాంచైజీ వర్గాలు చెబుతున్నాయి.
వైద్య కారణాల రీత్యా డగౌట్‌లోకి ఫోన్ తీసుకెళ్లేందుకు భిందర్‌కు అనుమతి ఉన్నప్పటికీ, అక్కడ కూర్చుని దానిని ఉపయోగించడానికి నిబంధనలు అంగీకరించవు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాలంటే చాలా దూరం నడవాల్సి వస్తుందనే కారణంతోనే ఆయన డగౌట్లో ఫోన్‌ను చూసి ఉండవచ్చని తెలుస్తోంది. ఆయన ఫోన్లో కాల్స్ మాట్లాడలేదని, కేవలం స్క్రోల్ మాత్రమే చేస్తున్నారని ఫ్రాంచైజీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో భిందర్ ఇచ్చే వివరణ, ఆయన అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఏసీఎస్‌యూ అధికారులు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.