Dhoni Vintage Car : ధోనీ గ్యారేజ్ లో మరో వింటేజ్ కార్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కార్లు, బైక్స్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ఆరంభం నుండే తన గ్యారేజ్ లో చాలా కలెక్షన్ ఉంది.
- By Hashtag U Published Date - 12:33 PM, Wed - 19 January 22

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కార్లు, బైక్స్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ఆరంభం నుండే తన గ్యారేజ్ లో చాలా కలెక్షన్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త , పాత మోడల్స్ తేడా లేకుండా నచ్చిన బైక్ కాని, కారు గానీ సేకరిస్తుంటాడు ధోనీ. ఇవన్నీ ఉంచేందుకు ఏకంగా పెద్ద స్థలాన్నే తీసుకున్నాడంటే వాటిపై మహికి ఉన్న ఇష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా రేసింగ్ బైక్స్ , పాత వింటేజ్ కార్లతో పాటు కొన్ని అరుదైన మోడల్స్ ను కొనుగోలు చేస్తూ ఉంటాడు. వీటిపై తన సొంత పట్టణం రాంఛీలో చాలా సార్లు షికారు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ధోనీ గ్యారేజ్ లోకి మరో అరుదైన మోడల్ కారు చేరింది. వింటేజ్ ల్యాండ్ రోవర్ కారును వేలంలో పోటీపడి సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
గత నెలలో బిగ్ బాయ్ టాయ్జ్ అనే షోరూం ఈ కారుకు వేలం నిర్వహించగా.. ధోనీ కూడా ఇందులో పాల్గొన్నాడు. 1970 మోడల్ కు చెందిన ల్యాండ్ రోవర్ 3 కారును ధోనీ వేలంలో దక్కించుకున్నాడు. ఈ కారుకు ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక స్థానముంది. 1970 నుండి 1980 మధ్య మాత్రమే దీని ఉత్పత్తి ఉండేది.
2.25 లీటర్ల ఇంజన్ సామర్థ్యం కలిగిన ఈ ల్యాండ్ రోవర్ కారు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో నడుస్తుంది. ధోనీ వేలంలో ఎంత ధర వెచ్చించాడనేది మాత్రం సదరు షోరూం వెల్లడించలేదు. అయితే వేలంలో చాలా మందే పోటీపడినట్టు మాత్రం తెలిపింది. మొత్తం మీద వింటేజ్ కారు కలెక్షన్ లో ధోనీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడంటూ అభిమానులు కారు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.