IND vs BAN T20 Squad: నితీశ్ కుమార్ రెడ్డికి సెలక్టర్ల పిలుపు, బంగ్లాతో టీ20లకు భారత జట్టు ఇదే
IND vs BAN T20 Squad: బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ కు భారత జట్టు.వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్ , జితేశ్ శర్మలకు చోటు దక్కింది. సంజూ శాంసన్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గాసెలక్టర్లు జితేశ్ ను ఎంపిక చేశారు. ఈ సిరీస్ సంజూకు కీలకంగా మారిందని చెప్పొచ్చు
- By Praveen Aluthuru Published Date - 11:18 PM, Sat - 28 September 24

IND vs BAN T20 Squad: బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) సారథ్యంలో పూర్తిగా యువ జట్టునే సెలక్టర్లు ఎంపిక చేశారు. ఊహించినట్టుగానే సీనియర్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇచ్చారు. ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. నిజానికి జింబాబ్వే టూర్ కే నితీశ్(Nitish Kumar Reddy) ఎంపికైనా గాయంతో చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్ తో టీ20లకు ఈ తెలుగు క్రికెటర్ కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్న నితీశ్ కుమార్ 17వ సీజన్ లో సత్తా చాటాడు. ఇదిలా ఉంటే యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ప్లేస్ నిలుపుకున్నాడు. ఐపీఎల్ లో పరుగుల వరద పారిస్తూ జింబాబ్వే టూర్ కు ఎంపికైన ఈ యువ ఓపెనర్ రెండో మ్యాచ్ లో సెంచరీతో దుమ్మురేపాడు.
ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్ , జితేశ్ శర్మలకు చోటు దక్కింది. సంజూ శాంసన్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గాసెలక్టర్లు జితేశ్ ను ఎంపిక చేశారు. ఈ సిరీస్ సంజూకు కీలకంగా మారిందని చెప్పొచ్చు. బంగ్లాతో సిరీస్ పై ఈ కేరళ క్రికెటర్ సత్తా చాటితే సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యే ఛాన్సుంది. ఇక హార్థిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రాగా… రింకూసింగ్ , రియాన్ పరాగ్, శివమ్ దూబేలకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ , రవి బిష్ణోయ్ తో పాటు వరుణ్ చక్రవర్తి కూడా ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే పేస్ విభాగంలో అర్షదీప్ సింగ్ కు తోడుగా హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ కూడా ఈ ఏడాది ఐపీఎల్ లో సత్తా చాటారు. 150కి,మీ వేగంతో బౌలింగ్ చేసే మయాంక్ గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించడంతో సెలక్టర్లు ఎంపిక చేశారు. మయాంక్ బంగ్లా టూర్ లో సక్సెస్ అయితే ఆసీస్ టూర్ కు పరిగణలోకి తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం. కాగా బంగ్లాదేశ్ తో మూడు టీ ట్వంటీల సిరీస్ అక్టోబర్ 6 నుంచి మొదలుకానుంది. తొలి మ్యాచ్ గ్వాలియర్ లో జరగనుండగా.. రెండో మ్యాచ్ కు న్యూఢిల్లీ, చివరి టీ ట్వంటీకి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనున్నాయి.
Also Read: IPL 2025: ఐపీఎల్ ప్లేయర్స్ కు జాక్ పాట్, సీజన్ కు రూ.కోటి అదనం