Retirement: త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్న మేరీకోమ్..?
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ (Mary Kom) త్వరలోనే రిటైర్మెంట్ (Retirement) ప్రకటించనున్నారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ అయిన మేరీ కోమ్ వయసు ఈ ఏడాది నవంబరులో 41 ఏళ్లకు చేరుకుంటుంది.
- Author : Gopichand
Date : 14-03-2023 - 7:18 IST
Published By : Hashtagu Telugu Desk
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ (Mary Kom) త్వరలోనే రిటైర్మెంట్ (Retirement) ప్రకటించనున్నారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ అయిన మేరీ కోమ్ వయసు ఈ ఏడాది నవంబరులో 41 ఏళ్లకు చేరుకుంటుంది. బాక్సింగ్ నిబంధనల ప్రకారం 40 ఏళ్లు దాటిన బాక్సర్లు పోటీలో పాల్గొనే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే మేరీ కోమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మార్చి 15 నుండి 26 వరకు జరగనున్న మహీంద్రా IBA ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2023 బ్రాండ్ అంబాసిడర్‌లుగా ప్రముఖ బాక్సర్ MC మేరీ కోమ్, బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్‌లను నియమించినట్లు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా BFI ప్రకటించింది. భారత్ చరిత్రలో మూడోసారి ఈ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారతదేశం గతంలో 2006, 2018లో IBA మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించింది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఐబీఏ మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం ఈ ఏడాది 74 దేశాల నుంచి 350 మందికి పైగా బాక్సర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారిగా రూ.20 కోట్ల ప్రైజ్ పూల్ ఉంది.
Also Read: Royal Challengers Bangalore: మళ్లీ ఓటమే.. డబ్ల్యూపీఎల్ లో ఐదో ఓటమి చవిచూసిన బెంగళూరు
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మేరీ మాట్లాడుతూ.. తనకింకా ఒక్క ఏడాది మాత్రమే సమయం ఉందని, ఈలోపు ఒక్కసారైనా క్రీడల్లో పాల్గొనాలనేది తన కల అని పేర్కొంది. ఆసియా క్రీడలకు అర్హత సాధించకుంటే కనుక చివరిగా మరేదైనా అంతర్జాతీయ టోర్నీలో పాల్గొని వీడ్కోలు చెప్పాలనుకుంటున్నట్టు తెలిపింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీకోమ్ ఈసారి ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం లేదు. అయితే, మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక ఛాంపియన్‌లు సాధించిన బాక్సర్‌గా నిలిచింది. మేరీ ఆరుసార్లు స్వర్ణం, ఒకసారి రజతం, కాంస్యం సాధించింది.