Manish Pandey: స్టార్ క్రికెటర్ మనీష్ పాండేకు బిగ్ షాక్
పాండే దాదాపు ఒక దశాబ్దం పాటు జట్టులో కొనసాగుతున్నాడు. రాష్ట్ర క్రికెట్‌లో పాండే కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఉన్నపళంగా అతడిని తొలగించడానికి ఓ కారణముంది. యువ రక్తానికి అవకాశం కల్పించడం కోసమే 35 ఏళ్ల మనీష్‌ను తొలగించినట్లు తెలుస్తుంది.
- By Gopichand Published Date - 10:20 AM, Thu - 12 December 24

Manish Pandey: గత ఐపీఎల్ లో జగజ్జేతగా నిలిచిన కేకేఆర్ తదుపరి సీజన్ కోసం సిద్ధమవుతుంది. తాజాగా జరిగిన మెగా వేలంలో కేకేఆర్ బలమైన ఆటగాళ్లను దక్కించుకుంది. కాగా ఆ జట్టులోని ఓ వెటరన్ బ్యాట్స్‌మెన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ ఆటగాడిని సొంత వాళ్లే పక్కనపెట్టడం పలు అనుమానాలకు దారి తీసింది. మెగా వేలంలో వెటరన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండేని (Manish Pandey) అతని బేస్ ధర 75 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు మనీష్‌ను అతని సొంత జట్టు కర్ణాటక తొలగించింది. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే కర్ణాటక జట్టులో మనీష్‌కు చోటు దక్కలేదు. పాండేకి ఇది ఎదురు దెబ్బ అనే చెప్పాలి.
పాండే దాదాపు ఒక దశాబ్దం పాటు జట్టులో కొనసాగుతున్నాడు. రాష్ట్ర క్రికెట్‌లో పాండే కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఉన్నపళంగా అతడిని తొలగించడానికి ఓ కారణముంది. యువ రక్తానికి అవకాశం కల్పించడం కోసమే 35 ఏళ్ల మనీష్‌ను తొలగించినట్లు తెలుస్తుంది. పాండేతో కేకేఆర్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. 2014లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో మనీష్ కీలక పాత్ర పోషించాడు. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మూడో స్థానంలో వచ్చిన మనీష్ 50 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 94 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతను సెంచరీని కోల్పోయినప్పటికీ కేకేఆర్ ని ఛాంపియన్ చేశాడు.
Also Read: Rohit- Virat: ప్రాక్టీస్ లోను రోహిత్ విఫలం.. పుంజుకున్న విరాట్
మనీష్ పాండే 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 2008లో అతను ముంబై ఇండియన్స్‌లో భాగమయ్యాడు. 2009 నుండి 2010 వరకు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. 2011 నుండి 2013 వరకు పూణే వారియర్స్, 2014 నుండి 2017 వరకు కేకేఆర్ తో జత కట్టాడు. ఆ తర్వాత 2018 నుండి 2021వరకు సన్ రైజర్స్ కి ఆడాడు. ఇక 2022లో లక్నోకి, 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడాల్సి వచ్చింది. 2024లో మళ్ళీ కేకేఆర్ జెర్సీలో కనిపించాడు. పాండే 171 మ్యాచ్‌లలో 1 సెంచరీ మరియు 22 అర్ధ సెంచరీలతో 3850 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్ పాండేనే కావడం విశేషం.