RCB vs CSK : ఆర్సీబీతో కీలక మ్యాచ్..చెన్నై తుది జట్టులో మార్పులు లేనట్టే
- By Latha Suma Published Date - 08:17 PM, Fri - 17 May 24

RCB vs CSK: ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే మూడు ఖరారయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) రేసులో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగే పోరు చివరి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో డిసైడ్ చేయబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ తక్కువ మార్జిన్ తో ఓడినా కూడా ఆ జట్టుకు అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో చెన్నై తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆ జట్టు ఆటతీరు చూస్తే ఈ కీలక మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశముంది. అయితే చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఎక్స్ ట్రా బ్యాటర్ తో ఆడే అవకాశముంది. అయితే మార్పులు చేయడం ఇష్టం లేకుంటే వెటరన్ ప్లేయర్ రహానే రిజర్వ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఓపెనర్లుగా రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నారు. వీరి నుంచి మెరుపు ఆరంభాన్ని సీఎస్కే మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. మిగిలిన బ్యాటింగ్ లో డారిల్ మిచెల్, మోయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీపై అంచనాలున్నాయి. ముఖ్యంగా శివమ్ దూబే మెరుపులు చెన్నై భారీస్కోరుకు కీలకం కానున్నాయి. ఈ సీజన్ లో దూబే అంచనాలకు తగ్గట్టే రాణించాడు. కీలక మ్యాచ్ లో కూడా అతను చెలరేగితే బెంగళూరు బౌలర్లకు చుక్కలే. ఇక చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు వస్తున్న ధోనీ కూడా మెరుపులు మెరిపిస్తే చెన్నైకి తిరుగుండదు. అటు బౌలింగ్ పరంగానూ
ఎటువంటి మార్పులు జరిగే అవకాశం లేదు. శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జిత్ సింగ్ పేస్ భారాన్ని మోయనుండగా.. మహీష్ తీక్షణ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. కాగా గత మ్యాచ్ లో చెన్నై రాజస్థాన్ రాయల్స్ పై గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లో బెంగళూరుపై గెలవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.