Sanju Samson: కష్ట పరిస్థితుల్లో వన్డేల్లో సెంచరీ చేయడం ఎంతో ఆనందం ఉంది: సంజూ శాంసన్
- Author : Balu J
Date : 22-12-2023 - 5:06 IST
Published By : Hashtagu Telugu Desk
Sanju Samson: సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడు. ఇక బౌలింగ్‌లో అర్షదీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సంజూ శాంసన్ ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కష్టకాలంలో ఉన్నా.. మెల్లిగా అన్నీ చూసుకుంటూ ఆడుతూ సెంచరీని చేశారు. సుదీర్ఘ అనుభవం, ప్రతిభ, మెరుగైన సగటురేటు ఉన్నా..ఇప్పటి వరకు సంజూకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే.. అంతకుముందు వచ్చిన అవకాశాల్లో అంతగా రాణించలేకపోవడమే కారణం. కానీ.. ఈసారి వచ్చిన అవకాశాన్ని మాత్రం ఏమాత్రం వదులుకోలేదు.
తాను ఆడిన వన్డే మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ బాదాడు. అంతేకాదు.. మూడో స్థానంలో వచ్చి దాదాపు చివరి వరకు నిలబడ్డాడు. వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్‌కు వెళ్తున్నా.. సంజూ మాత్రం నిలకడగా ఆడి జట్టును ఆదుకున్నాడు. మరోవైపు తిలక్ వర్మ అర్థశతకం చేసి.. తనవంతు పాత్ర పోషించాడు.
ఈ సందర్బంగా మాట్లాడిన సంజూ శాంసన్ గత మూడు, నాలుగు నెలలుగా మానసికంగా ఎంతో బాధపడ్డానని చెప్పాడు. కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడి వన్డేల్లో సెంచరీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. టీమిండియా గెలుపులో కీలక పాత్రుడిని అయినందుకు గర్వంగా ఉందని చెప్పాడు సంజూ శాంసన్. అయితే.. తన నాన్న ఒక స్పోర్ట్స్ మేన్ అని గుర్తు చేశాడు. ఎన్నిసార్లు కిందపడ్డా.. మళ్లీ అంతకంటే బలంగా దూసుకురావడం ముఖ్యమని సంజూ శాంసన్ చెప్పాడు.