విరాట్ కోహ్లీకి గర్వం ఉందా? రహానే సమాధానం ఇదే!
ప్రస్తుతం విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్నారు. మొదటి వన్డేలో 93 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నారు.
- Author : Gopichand
Date : 12-01-2026 - 9:13 IST
Published By : Hashtagu Telugu Desk
Ajinkya Rahane: అజింక్యం రహానే సుదీర్ఘకాలం పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్‌గా పనిచేశారు. కాబట్టి కోహ్లీ స్వభావం గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉంది. కోహ్లీని విమర్శించే ఒక వర్గం ఆయనను గర్విష్ఠిగా భావిస్తుంది. అయితే ఆట పట్ల కోహ్లీకి ఉన్న అంకితభావాన్ని బయటి వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని రహానే అభిప్రాయపడ్డారు. “కోహ్లీ కేవలం తన ఆటలో మునిగిపోతాడు” అని రహానే పేర్కొన్నారు.
విరాట్ కోహ్లీ గర్విష్ఠియా?
రహానే ‘క్రిక్‌బజ్’తో మాట్లాడుతూ ఇలా అన్నారు. విరాట్ కోహ్లీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నేను ఆయన్ని చాలా దగ్గర నుండి చూశాను. బ్యాటింగ్‌కు వెళ్ళేటప్పుడు ఆయనకు ఉండే పట్టుదల గురించి మనందరికీ తెలిసిందే. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోని నైజం ఆయన్ని అందరికంటే భిన్నంగా నిలబెడతాయి. బయటి వారు ఆయనను గర్విష్ఠి అనుకుంటార. కానీ అది నిజం కాదు. కోహ్లీ కేవలం తన ఆటలో లీనమైపోతాడు అని పేర్కొన్నారు.
మౌనంగా ఉండటం అంటే అహంకారం కాదని రహానే స్పష్టం చేశారు. ఆటపై ఏకాగ్రత వహించేందుకు కోహ్లీ అనుసరించే విధానం అది అని చెప్తూ.. “మ్యాచ్‌కు రెండు రోజుల ముందు నేను ఆయన్ని గమనించాను. ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. జట్టు సభ్యులతో కూడా ఎక్కువగా చర్చించరు. తన చుట్టూ ఒక ప్రత్యేకమైన ‘జోన్’ ఏర్పరచుకుంటారు. తనకు ఇష్టమైనవి వింటూ తనను తాను ఏకాగ్రతతో ఉంచుకుంటారు” అని తెలిపారు.
Also Read: మాజీ ఉపరాష్ట్రపతికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!
కొత్త ఆటగాళ్లకు అర్థం కావడానికి సమయం పడుతుంది
కోహ్లీ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చాలా మంది కొత్త ఆటగాళ్లకు సమయం పడుతుందని రహానే అన్నారు. “కోహ్లీ సహచరులతో మాట్లాడటం లేదంటే ఆయన తన ఆట కోసం సిద్ధమవుతున్నారని నేను అర్థం చేసుకునేవాడిని. క్రికెట్‌లో అన్నీ సాధించినా.. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆయనలో ఉంది. ఆయన పనితీరు అద్భుతం. ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి చేస్తూ జట్టుకు సహకరించాలని ఆయన కోరుకుంటారు” అని రహానే ప్రశంసించారు.
అద్భుతమైన ఫామ్‌లో కోహ్లీ
ప్రస్తుతం విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్నారు. మొదటి వన్డేలో 93 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నారు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ బాదారు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లో రెండింటిలో సెంచరీలు సాధించారు. భారత్- న్యూజిలాండ్ మధ్య రెండవ వన్డే బుధవారం, జనవరి 14న రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.