Shardul Thakur: లక్నో జట్టులోకి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్?
ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG)లో చేరాడు.
- By Gopichand Published Date - 12:30 PM, Fri - 21 March 25

Shardul Thakur: ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG)లో చేరాడు. PTI నివేదిక ప్రకారం.. ఈ సీజన్ కోసం సన్నాహకాల నుండి ఠాకూర్ జట్టుతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రిషబ్ పంత్ కెప్టెన్సీలో గాయపడిన మొహ్సిన్ ఖాన్ స్థానంలో ఠాకూర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
మోహ్సిన్ ఖాన్ గాయపడ్డాడు
మొహ్సిన్ ఖాన్ గాయంతో బాధపడుతున్నాడు. దీని కారణంగా గత మూడు నెలలుగా అతను ఏ క్రికెట్ మ్యాచ్‌లోనూ పాల్గొనలేకపోయాడు. అతను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పుడు కాఫ్ స్ట్రెయిన్‌తో బాధపడ్డాడు. ఇది అతని పునరాగమనాన్ని మరింత కష్టతరం చేసింది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ ఉన్నారు. కానీ ఈ ముగ్గురూ ఇంకా ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీతోనూ సంబంధం కలిగి లేరు. ఆకాష్ దీప్, మయాంక్ ప్రస్తుతం COE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో ఉన్నారు. అయితే అవేష్ ఖాన్ మోకాలి గాయం నుండి కోలుకుంటున్నాడు. ఇంకా జట్టులో చేరలేదు. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ నెట్స్‌లో తేలికపాటి వేగంతో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. కానీ అతను ఇంకా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 కోసం అంపైర్లను ప్రకటించిన బీసీసీఐ!
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటర్ జహీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. మా ఆటగాళ్లలో కొందరు గాయపడటం వల్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ఇప్పుడు మేమే సానుకూల విషయాలను వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని పరిష్కారాలను స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. కొంతమంది ఆటగాళ్ళు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నారు. మరికొందరు వారి ఫిజియోతో ఉన్నారు. ప్రస్తుతానికి దీని గురించి ఏమీ చెప్పలేను. కానీ ఈ సీజన్‌లో పరిస్థితి చాలా సవాలుగా ఉంటుందని చెప్పారు.
ప్రధాన ఫాస్ట్ బౌలర్లు లేనందున శార్దూల్ ఠాకూర్ ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఎందుకంటే అతను జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్. LSG జట్టులో షమర్ జోసెఫ్ మాత్రమే విదేశీ ఫాస్ట్ బౌలర్. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ ఆటగాళ్ళు కూడా జట్టులో ఉన్నారు. స్పిన్ విభాగంలో స్థిరత్వం ఉంది. కానీ ఫాస్ట్ బౌలింగ్ విషయంలో జట్టు సవాళ్లను ఎదుర్కొంటుంది.