Final Test: అహ్మదాబాద్ టెస్ట్ డ్రా.. సిరీస్ భారత్ కైవసం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా వరుసగా మూడోసారి కైవసం చేసుకుంది. సొంతగడ్డపై జరిగిన సిరీస్ ను 2-1 తో గెలుచుకుంది. ఊహించినట్టుగానే అహ్మదాబాద్ టెస్ట్...
- Author : Naresh Kumar
Date : 13-03-2023 - 3:59 IST
Published By : Hashtagu Telugu Desk
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా వరుసగా మూడోసారి కైవసం చేసుకుంది. సొంతగడ్డపై జరిగిన సిరీస్ ను 2-1 తో గెలుచుకుంది. ఊహించినట్టుగానే అహ్మదాబాద్ టెస్ట్ (Ahmedabad Test) డ్రాగా ముగిసింది. చివరిరోజు భారత బౌలర్లు మ్యాజిక్ చేస్తారనుకున్న అభిమానుల ఆశలు నెరవేరలేదు. ఆరంభంలోనే కునేమన్ వికెట్ కోల్పోయినప్పటకీ తర్వాత ఆసీస్ బ్యాటర్లు నిలకడగా ఆడారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ , లబూషేన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 139 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హెడ్ 10 ఫోర్లు 2 సిక్సర్లతో 90 పరుగులకు ఔటవగా.. లబూషేన్ 7 ఫోర్లతో 63 రన్స్ చేశాడు. ఫలితం లేకపోవడంతో టీ బ్రేక్ తర్వాత కెప్టెన్ లు డ్రా వైపు మొగ్గుచూపారు. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 2 వికెట్లకు 175 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ , అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. సిరీస్ లో తొలిసారి ఈ మ్యాచ్ లోనే భారీస్కోర్లు నమోదయ్యాయి.
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌటవగా… ధీటుగా జవాబిచ్చిన భారత్ శుభ్ మన్ గిల్ , కోహ్లీ సెంచరీలతో భారీస్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 571 రన్స్ కు ఆలౌటైంది. తద్వారా 91 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే చివరిరోజు కూడా పిచ్ బ్యాటింగ్ కే అనుకూలించడంతో బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తొలి రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తే.. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. గత రెండు పర్యాయాలూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారతే గెలుచుకోగా.. ఇప్పుడు కూడా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ హ్యాట్రిక్ కొట్టింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (World Test Championship) ఫైనల్ కు చేరింది. లంకపై న్యూజిలాండ్ గెలవడం ద్వారా రోహిత్ సేనరు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ శుక్రవారం నుంచి మొదలు కానుంది. తొలి వన్డే ముంబైలో జరగనుండగా… రెండో వన్డేకు విశాఖ ఆతిథ్యమిస్తోంది. సిరీస్ లో చివరి మ్యాచ్ మార్చి 22న చెన్నైలో జరగనుంది.
Also Read: Big Loan Deal: రిలయన్స్ కు రూ.24,600 కోట్ల లోన్ ఇచ్చేందుకు 10 బ్యాంకులు రెడీ