India vs Pakistan: ఆకట్టుకున్న భారత బౌలర్లు.. పాక్ స్కోర్ 159/8
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత బౌలర్లు అదరగొట్టారు.
- Author : Naresh Kumar
Date : 23-10-2022 - 4:21 IST
Published By : Hashtagu Telugu Desk
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత బౌలర్లు అదరగొట్టారు. పాకిస్థాన్‌ను 159 పరుగులకే కట్టడి చేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్‌శర్మ అంచనాలకు తగ్గట్టే భారత పేసర్లు సత్తా చాటారు. తొలి ఓవర్‌లో భువనేశ్వర్ 1 పరుగే ఇవ్వగా.. రెండో ఓవర్ తొలిబంతికే అర్షదీప్‌సింగ్ బాబర్ అజామ్‌ను డకౌట్ చేశాడు. కాసేపటికే రిజ్వాన్‌కు కూడా పెవిలియన్‌కు పంపించాడు. ఈ దశలో పాకిస్థాన్‌ను ఇఫ్తికార్ అహ్మద్, మసూద్ ఆదుకున్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. అక్షర్ పటేల్ వేసిన ఓ ఓవర్లో ఇఫ్తికార్ 3 సిక్సర్లు కొట్టడంతో పాక్ స్కోర్ వేగం పుంజుకుంది.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఇఫ్తికార్ ఔటయ్యాడు.ఇఫ్తికార్ 34 బాల్స్‌లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 51 రన్స్ చేశాడు. ఇదిలా ఉంటే పాక్ మిడిలార్డర్‌ను హార్థిక్ పాండ్యా దెబ్బకొట్టాడు. వరుస వికెట్లతో పాక్ స్కోరుకు బ్రేక్ వేశాడు. అయితే మసూద్ చివరి వరకూ క్రీజులో ఉండడంతో పాక్ స్కోర్ 150 దాటగలిగింది. మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో షాహీన్ అఫ్రిది 8 బంతుల్లో 16 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో అర్షదీప్ 32 పరుగులు ఇచ్చి 3 వితెట్లు, పాండ్యా 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ 22 పరుగులకు 1 వికెట్ పడగొడితే షమీ 1 వికెట్ తీశాడు.