అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ భారీ స్కోర్!
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దీనితో పాటు అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ.
- Author : Gopichand
Date : 06-02-2026 - 5:46 IST
Published By : Hashtagu Telugu Desk
World Cup Final Score: అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో టీమ్ ఇండియా అద్భుతం సృష్టించింది. వైభవ్ సూర్యవంశీ మెరుపు వేగంతో సాధించిన 175 పరుగుల పుణ్యమా అని, అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే భారత్ భారీ స్కోరును నమోదు చేసింది. ఈ నిర్ణయాత్మక పోరులో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలవాలంటే 412 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యమైన లక్ష్యం.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఒక్కడే 175 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్, మొత్తం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చారిత్రక రికార్డు నెలకొల్పాడు. ఇందులో 15 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వైభవ్ కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే 150 పరుగులు రాబట్టాడు.
వైభవ్ సూర్యవంశీ కొత్త వరల్డ్ రికార్డ్
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దీనితో పాటు అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. అండర్-19 వరల్డ్ కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన విల్ మాలాజుక్ పేరిట ఉండగా, ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ వరల్డ్ రికార్డ్ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ సొంతమైంది. అలాగే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసిన మూడో భారతీయుడిగా వైభవ్ నిలిచాడు. గతంలో ఉన్ముక్త్ చంద్ (2012), మన్జోత్ కాల్రా (2018) ఈ ఘనత సాధించారు.
భారత ఇన్నింగ్స్ ఇలా సాగింది
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా మొదటి వికెట్‌ను 20 పరుగుల వద్ద కోల్పోయింది. ఆరోన్ జార్జ్ 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే, వైభవ్ సూర్యవంశీ కలిసి 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్హాత్రే 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
వేదాంత్ త్రివేది: 36 బంతుల్లో 32 పరుగులు
విహాన్ మల్హోత్రా: 36 బంతుల్లో 30 పరుగులు
వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు: 31 బంతుల్లో 40 పరుగులు
కనిష్క్ చౌహాన్: 20 బంతుల్లో 37 పరుగులు (నాటౌట్)
ఇంగ్లాండ్ బౌలర్లలో సెబాస్టియన్ మోర్గాన్ 9 ఓవర్లలో 74 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అలెక్స్ గ్రీన్ 5 ఓవర్లలో 49 పరుగులిచ్చి ఇద్దరిని అవుట్ చేయగా.. జేమ్స్ మింటో 8 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మేనీ లమ్స్డెన్కు కూడా ఒక వికెట్ దక్కింది.