Paris Olympics 2024 : ఏడు పతకాలు జస్ట్ మిస్.. ఆరు పతకాలతో సరిపెట్టుకున్న భారత్
కనీసం రెండంకెల పతకాలనైనా సాధించకుండానే పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానం ముగిసింది.
- By Pasha Published Date - 10:37 AM, Sun - 11 August 24

Paris Olympics 2024 : కనీసం రెండంకెల పతకాలనైనా సాధించకుండానే పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానం ముగిసింది. ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక పతకం తక్కువే వచ్చింది. బ్యాడ్మింటన్, బాక్సింగ్ విభాగాలు భారత్‌కు నిరాశే మిగిల్చాయి. ఈ నిరాశతోనే పారిస్ నుంచి భారత ప్లేయర్ల టీమ్ వెనుదిరిగింది. అయితే హాకీలో భారత జట్టుకు కాంస్యం దక్కడం, మనూ బాకర్ రెండు పతకాలను కైవసం చేసుకోవడం, నీరజ్ సంచలనం వంటి తీపి గుర్తులు కూడా మనకు ఈ ఒలింపిక్స్‌లో మిగిలాయి. పారిస్ ఒలింపిక్స్‌లో(Paris Olympics 2024) దాదాపు ఏడు పతకాలు త్రుటిలో భారత్‌కు చేజారాయి. అవి ఒకవేళ వచ్చి ఉంటే భారత్ రెండంకెల పతకాలను సాధించి ఉండేది. ఇంతకీ అవేమిటో చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
- అర్జున్ బబుత పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో కొంచెంలో పతకాన్ని కోల్పోయాడు. 1.4 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని అతడు మిస్సయ్యాడు.
- లక్ష్యసేన్ కీలక మ్యాచ్‌లో చేతులు ఎత్తేశాడు. కాంస్య పతకపోరులో తొలి సెట్ గెలిచిన అతడు.. ఆ తర్వాత ఓడిపోయాడు. దీంతో పతకం మిస్సయ్యింది.
- రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఆ విభాగంలో తప్పనిసరిగా వస్తుందని ఆశించిన పతకం రాకుండా పోయింది. వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఫైనల్ మ్యాచ్‌లో ఆడకుండా వినేశ్‌పై బ్యాన్ విధించారు. వినేశ్ చేసిన అప్పీల్‌పై ఈనెల 13న తీర్పు రానుంది.
- కేవలం కేజీ బరువు తేడాతో మీరాబాయ్ చాను ఒలింపిక్స్ పతకాన్ని కోల్పోయారు. ఆమె 199కిలోలు ఎత్తి నాలుగో స్థానంతో నిలవగా, థాయ్‌లాండ్ లిఫ్టర్ సురోచన కాంబవో 200 కేజీలు ఎత్తి కాంస్యాన్ని గెలిచారు.
- మనూ బాకర్ ఈ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచారు. అయితే ఆమె మూడో పతకం కూడా గెలిచేదే. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మనూ బాకర్ నాలుగో స్థానంలో నిలిచారు. మనూ బాకర్ మూడోస్థానంలో నిలిచి ఉంటే ఇంకో పతకం ఆమెకు వచ్చేది.
- యువ షూటర్లు మహేశ్వరి చౌహాన్, అనంత్‌జీత్‌సింగ్ నరుక, ఆర్చరీలో బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్, రెజ్లింగ్‌లో రితికా హుడాలు సైతం త్రుటిలో పతకాలను మిస్ చేసుకున్నారు.