India Beat South Africa: టీమిండియా ఆల్ రౌండ్ షో.. మూడో వన్డే గెలుపుతో సిరీస్ కైవసం..!
సఫారీ పర్యటనలో భారత్ అదరగొడుతోంది. టీ ట్వంటీ సిరీస్ ను సమం చేసిన టీమిండియా.. సీనియర్లు లేకున్నా వన్డే సిరీస్ కైవసం (India Beat South Africa) చేసుకుంది.
- By Gopichand Published Date - 06:37 AM, Fri - 22 December 23

India Beat South Africa: సఫారీ పర్యటనలో భారత్ అదరగొడుతోంది. టీ ట్వంటీ సిరీస్ ను సమం చేసిన టీమిండియా.. సీనియర్లు లేకున్నా వన్డే సిరీస్ కైవసం (India Beat South Africa) చేసుకుంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో సమిష్టిగా రాణించి సఫారీలను 78 పరుగుల తేడాతో నిలువరించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు అనుకున్న ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. రజత్ పటిదార్ 22 , సాయిసుదర్శన్ 10 పరుగులకే ఔటవగా… కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా త్వరగానే వెనుదిరిగాడు.
అయితే సంజూ శాంసన్, హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ చక్కని పార్టనర్ షిప్ తో జట్టును ఆదుకున్నారు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నిలకడగా ఆడుతూ చక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మతో కలిసి నాలుగో వికెట్ కు 116 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శాంసన్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేయగా.. తిలక్ వర్మ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.
వీరిద్దరూ ఔటైన తర్వాత రింకూసింగ్ చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ 296 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన రింకూ 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. సఫారీ బౌలర్లలో హెండ్రిక్స్ 3 , బర్గర్ 2 వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు హెండ్రిక్స్ , జోర్జి తొలి వికెట్ కు 59 రన్స్ జోడించారు. అయితే పవర్ ప్లే తర్వాత భారత బౌలర్లదే పై చేయిగా నిలిచింది. వరుస వికెట్లు తీస్తూ సఫారీలపై ఒత్తిడి పెంచారు. జోర్జి మరో హాఫ్ సెంచరీతో రాణించినా…81 పరుగుల దగ్గర అర్షదీప్ సింగ్ పెవిలియన్ కు పంపాడు, తర్వాత కెప్టెన్ మక్రరమ్ , వికెట్ కీపర్ క్లాసెన్ కాసేపు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా భారత బౌలర్లు వారికి అవకాశమివ్వలేదు.
We’re now on WhatsApp. Click to Join.
మక్రరమ్ 36, క్లాసెన్ 21 రన్స్ చేయగా.. డేవిడ్ మిల్లర్ ను ముకేశ్ కుమార్ ఔట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. కాసేపు టెయిలెండర్లు పోరాడినా పరుగుల అంతరాన్ని తగ్గించగలిగారే తప్ప భారత్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఫలితంగా సౌతాఫ్రికా ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ గెలుచుకుంది. తొలి వన్డేలో భారత్ గెలిస్తే…రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ పర్యటన ఆరంభంలో టీ ట్వంటీ సిరీస్ ను భారత్ సమం చేసింది. కాగా రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది.