శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. 5-0తో సిరీస్ కైవసం!
ఓపెనర్ హసిని పెరీరా (42 బంతుల్లో 65 పరుగులు), ఇమేషా దులాని (39 బంతుల్లో 50 పరుగులు) అర్ధశతకాలతో పోరాడినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు.
- Author : Gopichand
Date : 30-12-2025 - 10:38 IST
Published By : Hashtagu Telugu Desk
టీమ్ ఇండియా, శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 5వ, చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపులు
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. భారత ఓపెనర్ స్మృతి మంధానకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు. షెఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జి. కమలిని తక్కువ పరుగులకే అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 68 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. రిచా ఘోష్, దీప్తి శర్మ విఫలమైనప్పటికీ, అమన్‌జోత్ కౌర్ (21 పరుగులు), చివరిలో అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 పరుగులు నాటౌట్) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, కవిషా దిల్హారి, రష్మిక సెవంది తలో 2 వికెట్లు పడగొట్టారు.
Also Read: సీఎం రేవంత్ పాలనలో స్థిరత్వం నుంచి స్మార్ట్ డెవలప్మెంట్ దిశగా తెలంగాణ!
శ్రీలంకకు వరుసగా 5వ ఓటమి
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ హసిని పెరీరా (42 బంతుల్లో 65 పరుగులు), ఇమేషా దులాని (39 బంతుల్లో 50 పరుగులు) అర్ధశతకాలతో పోరాడినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. కెప్టెన్ చమరి ఆటపట్టు కేవలం 2 పరుగులకే వెనుదిరిగారు. భారత బౌలర్లందరూ తలో వికెట్ పడగొట్టి క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమ్ ఇండియా 5-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.