IND vs AUS: భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు కావడానికి కారణం పిడుగులేనా?
క్వీన్స్‌లాండ్‌లో ఉరుములు, మెరుపుల తీవ్రత ఎంత ఉందంటే ఈ సంవత్సరం అక్కడ లక్షల సంఖ్యలో పిడుగులు పడిన సంఘటనలు నమోదయ్యాయి.
- By Gopichand Published Date - 09:35 PM, Sat - 8 November 25
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో ఆఖరి పోరు విషాదకరంగా ముగిసింది. క్వీన్స్‌లాండ్ రాజధాని బ్రిస్బేన్‌లో జరగాల్సిన ఈ ఐదో టీ20 మ్యాచ్, భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ఫలితం లేకపోవడంతో టీమిండియా ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
మెరుపుల ప్రమాదంతో మ్యాచ్ నిలిపివేత
భారత్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో ఆకాశంలో తీవ్రమైన మెరుపులు కమ్ముకోవడంతో మ్యాచ్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మైదానంలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉండటం వలన ఆటగాళ్ల భద్రత దృష్ట్యా మ్యాచ్‌ను తక్షణం నిలిపివేశారు. ఆటగాళ్లందరినీ వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కు తరలించారు. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి రాకపోవడం, సుదీర్ఘంగా వర్షం కురవడంతో మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత జట్టు స్కోరు 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది.
స్టేడియం స్టాండ్‌లు ఖాళీ
కేవలం ఆటగాళ్లే కాక ప్రేక్షకుల భద్రతకు కూడా అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పిడుగుల ప్రమాదం దృష్ట్యా.. స్టేడియంలోని దిగువ స్టాండ్‌లలోని ప్రేక్షకులను కూడా అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు.
Also Read: Strong Room: ఎన్నికల తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?
క్వీన్స్‌లాండ్‌లో పిడుగుల తీవ్రత
క్వీన్స్‌లాండ్‌లో ఉరుములు, మెరుపుల తీవ్రత ఎంత ఉందంటే ఈ సంవత్సరం అక్కడ లక్షల సంఖ్యలో పిడుగులు పడిన సంఘటనలు నమోదయ్యాయి. కేవలం నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ప్రాక్టీస్ చేస్తున్న ఒక ఫుట్‌బాల్ ఆటగాడు పిడుగుపాటుకు గురై మరణించడం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. ఈ ఘటన కారణంగా చాలా మంది ఆసుపత్రిలో కూడా చికిత్స పొందారు. ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, గత అనుభవాల కారణంగానే ఈ అంతర్జాతీయ మ్యాచ్‌ను రద్దు చేయడంలో ఎటువంటి సందేహానికి తావు లేకుండా అధికారులు వేగంగా నిర్ణయం తీసుకున్నారు.
2-1తో సిరీస్ భారత్ సొంతం
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలవగా, భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్ రద్దవడంతో టీమిండియా ఆ ఆధిక్యంతోనే సిరీస్‌ను గెలుచుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత్ టీ20 ఫార్మాట్‌లో ఓటమిలేని పరంపరను కొనసాగిస్తోంది.