Womens World Cup 2025: చరిత్రలో తొలిసారిగా మహిళా అంపైర్లు, రిఫరీల ప్యానెల్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ లో మొదటిసారిగా పూర్తిగా మహిళా అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమించింది.
- By Gopichand Published Date - 04:00 PM, Thu - 11 September 25

Womens World Cup 2025: ఐసీసీ (ICC) మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీ (Womens World Cup 2025) చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ లో మొదటిసారిగా పూర్తిగా మహిళా అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమించింది. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడంలో ఇది ఒక చారిత్రక ఘట్టం. అంతర్జాతీయ క్రికెట్‌లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
ఈ టోర్నమెంట్ కు ఎంపికైన మహిళా అధికారుల ప్యానెల్‌లో మొత్తం 15 మంది ఉన్నారు. వీరిలో 8 మంది అంపైర్లు, 7 మంది మ్యాచ్ రిఫరీలతో సహా పూర్తిస్థాయి మహిళా ప్యానల్ మ్యాచ్ నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి నాయకత్వం వహించనున్నవారిలో భారత్‌కు చెందిన జి.ఎస్.లక్ష్మి, న్యూజిలాండ్‌కు చెందిన షాండన్ క్రాక్, ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిర్ పొలోసాక్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. క్లెయిర్ పొలోసాక్ గతంలో పురుషుల అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అంపైర్లుగా ఎంపికైన వారిలో లారెన్ అగెన్‌బాగ్ (దక్షిణాఫ్రికా), సూ రెడ్‌ఫర్న్ (ఇంగ్లాండ్), కిమ్ కాటన్ (న్యూజిలాండ్), అన్నా హ్యారిస్ (ఇంగ్లాండ్), జాక్వెలిన్ విలియమ్స్ (వెస్టిండీస్) వంటి ప్రముఖులు ఉన్నారు.
ఈ నిర్ణయం కేవలం మహిళల క్రికెట్ లోనే కాకుండా ప్రపంచ క్రికెట్ లోనే ఒక విప్లవాత్మక మార్పుగా పరిగణించబడుతోంది. గతంలో కూడా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్ వంటి టోర్నీలలో మహిళా అంపైర్లు, రిఫరీలను నియమించి మహిళా క్రికెటర్లకు, అధికారులకు అవకాశాలు కల్పించింది. అయితే పూర్తిస్థాయిలో మహిళా ప్యానెల్‌ను నియమించడం ఇదే మొదటిసారి. ఇది మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, క్రికెట్‌లో కూడా పురుషులతో సమానంగా బాధ్యతలు నిర్వర్తించగలరని నిరూపిస్తోంది.
Also Read: AP Liquor Case: ఏపీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. జగన్ సన్నిహితుడి కంపెనీల్లో సోదాలు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి జనరల్ మేనేజర్ జెఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ.. “మహిళల క్రికెట్ లో ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించడం ఐసీసీ లక్ష్యం. మహిళల ప్రపంచ కప్‌కు మహిళా అధికారులను నియమించడం ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా అంపైర్లు, రిఫరీలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది” అని అన్నారు.