IPL 2022 : కెప్టెన్ గా అడుగుపెట్టనున్న హార్థిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలానికి ముందు పలు వార్తలు అభిమానుల్లో జోష్ ను పెంచుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కాని కొత్త ఫ్రాంచేజీలు ఎంపిక చేసుకునే ఆటగాళ్ళు ఎవరనే దానిపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి ఐపీఎల్ లోకి కొత్తగా లఖ్ నవూ , అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు అడుగుపెట్టాయి.
- By Hashtag U Published Date - 11:34 AM, Tue - 11 January 22

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలానికి ముందు పలు వార్తలు అభిమానుల్లో జోష్ ను పెంచుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కాని కొత్త ఫ్రాంచేజీలు ఎంపిక చేసుకునే ఆటగాళ్ళు ఎవరనే దానిపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి ఐపీఎల్ లోకి కొత్తగా లఖ్ నవూ , అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు అడుగుపెట్టాయి. వేలానికి ముందే ఈ రెండు జట్లూ ముగ్గురు ఆటగాళ్ళను ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు అప్పగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యను రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్న మెగా వేలంలో హార్దిక్ పాండ్య కోసం చాలా ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడే ఛాన్స్ ఉంది. అయితే కొత్త ఫ్రాంచైజీలకు ఉన్న వెసులుబాటు దృష్ట్యా అహ్మదాబాద్ ఇప్పటికే పాండ్యాతో చర్చించినట్టు సమాచారం.
కాగా అంతకుముందు అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి శ్రేయాస్ అయ్యర్ సారథిగా ఉండనున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే శ్రేయాస్ అయ్యర్ కంటే హార్దిక్ పాండ్య వైపే అహ్మదాబాద్ యాజమాన్యం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.2015లో కనీస ధర రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్‌లో అడుగుపెట్టిన హార్దిక్ నాలుగు ఐపీఎల్ టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో ముంబై టైటిల్ గెలవడంలో హార్దిక్ దే కీ రోల్. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను కూడా జట్టులోకి తీసుకోవాలని అహ్మదాబాద్ భావిస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్, సహాయక సిబ్బంది విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. అహ్మాదాబాద్ ఫ్రాంచైజీ దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.