Team India: యువ ఆటగాళ్లు సత్తా చాటేనా…? విండీస్ తో నేడు భారత్ తొలి వన్డే
ఇంగ్లాండ్ టూర్ ను సక్సెస్ ఫుల్ గా ముగించిన టీమిండియా ఇప్పుడు కరేబియన్ సవాల్ కు రెడీ అయింది. వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఇవాళ తొలి వన్డే ఆడనుంది.
- Author : Naresh Kumar
Date : 22-07-2022 - 10:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఇంగ్లాండ్ టూర్ ను సక్సెస్ ఫుల్ గా ముగించిన టీమిండియా ఇప్పుడు కరేబియన్ సవాల్ కు రెడీ అయింది. వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఇవాళ తొలి వన్డే ఆడనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో శిఖర్ ధావన్ భారత్ కు సారథిగా వ్యవరిస్తున్నాడు. అటు కోహ్లీ, బూమ్రా, పంత్, షమీ, హార్దిక్ ఈ సిరీస్‌లో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నారు. దీంతో యువ ఆటగాళ్లకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. పలువురు సీనియర్ల గైర్హాజరులో తమ సత్తా చాటేందుకు వారికి ఇది సరైన వేదిక.
ఒకప్పుడు అద్భుత ఓపెనర్‌గా ఘనమైన రికార్డులు సాధించిన శిఖర్ ధావన్ కొంత కాలంగా తడబడుతున్నాడు. అతను ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఇబ్బంది పడటం కనిపించింది. అయితే అదృష్టవశాత్తూ కెప్టెన్సీ అవకాశం దక్కిన అతను ఈ సిరీస్‌లోనైనా రాణించాల్సి ఉంది. అతనికి ఓపెనర్ జోడీగా ఆడేందుకు తీవ్ర పోటీ నెలకొంది. దూకుడుగా ఆడగల ఇషాన్ కిషన్ ఉండగా…నిలకడగా ఆడగల రుతురాజ్, శుబ్‌మన్ గిల్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.హుడా, సంజూ శాంసన్ కూడా మిడిలార్డర్‌లో చోటు ఆశిస్తున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా శ్రేయస్ అయ్యర్‌కు ఈ సిరీస్ కీలకం కానుంది. వరుసగా విఫలమవుతున్నా అతని ఆటపై నమ్మకంతో మేనేజ్‌మెంట్ మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తోంది. దీంతో తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది.
ఆల్‌రౌండర్లుగా జడేజా, శార్దుల్ కీలకం కానున్నారు. అయితే గాయంతో జడేజా తొలి వన్డకు దూరమయ్యాడు. అటు బుమ్రా లేకపోవడంతో ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్‌కు చోటు ఖాయమని చెప్పొచ్చు. స్పిన్ విభాగంలో చహల్ తన జోరు కొనసాగించేందుకు ఎదురు చూస్తున్నాడు.
మరోవైపు గత ప్రభావం మళ్లీ సాధించాలని పట్టుదలగా ఉన్న విండీస్ భారత్ కి ఎంత వరకూ పోటీ ఇస్తుందో చూడాలి. ఎందుకంటే సొంత గడ్డ పైనే ఆ జట్టు ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. టీ ట్వంటీలకు బాగా అలవాటు పడిన ఆ జట్టు కనీసం 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేక పోతోంది. 2019 వన్డే వరల్డ్ కప్‌నుంచి విండీస్ 39 ఇన్నింగ్స్‌లు ఆడితే 6 సార్లు మాత్రమే పూర్తి కోటా 50 ఓవర్లు ఆడగలిగింది. జట్టు బ్యాటింగ్ ప్రధానంగా పూరన్, పావెల్, మేయర్స్‌లపై ఆధారపడి ఉంది. కాగా మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తున్న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలించే అవకాశం ఉంది.