Cristiano Ronaldo: తొమ్మిదేళ్ల తర్వాత ప్రేయసిని నిశ్చితార్థం చేసుకున్న రొనాల్డో!
రొనాల్డో- జార్జినా 2016 నుండి ప్రేమించుకుంటున్నారు. తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ బంధం తర్వాత ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఇద్దరు మొదట ఒక బ్రాండ్ స్టోర్‌లో కలుసుకున్నారు.
- By Gopichand Published Date - 03:26 PM, Tue - 12 August 25

Cristiano Ronaldo: అల్ నస్సర్, పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన తొమ్మిదేళ్ల ప్రేయసి జార్జినా రోడ్రిగెజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన చేతిని, రొనాల్డో చేతిని పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ “అవును, నీతో నాకు ప్రేమ. ఈ జీవితంలో, వచ్చే ప్రతి జీవితంలో కూడా” అని క్యాప్షన్‌లో రాసింది.
తొమ్మిదేళ్ల ప్రేమ బంధం, పెళ్లి వైపు అడుగులు
రొనాల్డో- జార్జినా 2016 నుండి ప్రేమించుకుంటున్నారు. తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ బంధం తర్వాత ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఇద్దరు మొదట ఒక బ్రాండ్ స్టోర్‌లో కలుసుకున్నారు. తర్వాత 2017లో ప్రపంచానికి తమ ప్రేమ బంధాన్ని ప్రకటించారు. రొనాల్డో, జార్జినా దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. 2017లో ఎవా మరియా, మాటియా జన్మించారు. 2022లో బెల్లా ఎస్మెరాల్డాకు జన్మనిచ్చింది. వీరే కాకుండా రొనాల్డోకు మొదటి కుమారుడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్ 2010లో జన్మించాడు. ప్రస్తుతం జార్జినా అందరు పిల్లల సంరక్షణను చూసుకుంటుంది.
Also Read: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక!
గూచీ స్టోర్‌లో ప్రేమ చిగురించింది
అర్జెంటీనాలో జన్మించిన జార్జినా ఒక అద్భుతమైన డ్యాన్సర్. ఆమె మాడ్రిడ్‌కు వెళ్ళే ముందు స్పెయిన్‌లోని జాకాలో చదువుకుంది. ఆమె నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఐ యామ్ జార్జినా’ అనే రియాలిటీ సిరీస్ ద్వారా తన జీవితాన్ని అభిమానులకు చూపించింది. రొనాల్డో- జార్జినా 2016లో మొదటిసారిగా ఒక గూచీ స్టోర్‌లో కలుసుకున్నారు. ఆ సమయంలో జార్జినా అక్కడ పనిచేసేది. ఆ తొలి పరిచయం వారి మధ్య స్నేహానికి దారి తీసింది, తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది.
ఫుట్‌బాల్ మైదానంలోనూ రొనాల్డో అరుదైన రికార్డులు
రొనాల్డో ఈ ఏడాది క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో తన కెరీర్‌లో 900వ గోల్ సాధించి, ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా ప్రపంచంలో నిలిచారు. అల్ నస్సర్ తరఫున ఆడుతున్న రొనాల్డో సౌదీ ప్రో లీగ్‌లో ఇప్పటివరకు 30 మ్యాచ్‌లలో 25 గోల్స్ సాధించి తన సత్తా చాటాడు. ఫుట్‌బాల్ కెరీర్‌తో పాటు, తన వ్యక్తిగత జీవితంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసుకున్న రొనాల్డోకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.