Ben Stokes: ఆట మధ్యలోనే పెవిలియన్‌కు వెళ్లిపోయిన స్టోక్స్.. కారణం ఇదే?!
ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్లు జాక్ క్రాలీ 84 పరుగులు, బెన్ డకెట్ 94 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు పటిష్టమైన ఆరంభాన్ని ఇచ్చారు.
- By Gopichand Published Date - 06:45 AM, Sat - 26 July 25

Ben Stokes: మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారత జట్టుపై అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. జూలై 25న జరిగిన మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఒక కీలక అర్ధ సెంచరీ సాధించాడు. అయితే, అతను అకస్మాత్తుగా ఔట్ కాకుండానే మైదానం వీడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
స్టోక్స్ ఎందుకు రిటైర్డ్ హర్ట్ అయ్యాడు?
మూడో రోజు ఆటలో బెన్ స్టోక్స్ 116 బంతుల్లో 66 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతను 6 ఫోర్లు కూడా కొట్టాడు. అయితే క్రాంప్స్ (కండరాల నొప్పులు) కారణంగా అతను ‘రిటైర్డ్ హర్ట్’ అయి పెవిలియన్‌కు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. ఇది అతని మొదటి అర్ధ సెంచరీ. అది కూడా భారత్‌పై జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో. స్టోక్స్ కొంత సమయం తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చి జట్టుకు భారీ స్కోర్ అందించే దిశగా బ్యాటింగ్ చేస్తున్నాడు. స్టోక్స్ బ్యాటింగ్‌కు దిగిన కొంతసేపటికి ఆట మూడో రోజు ముగిసింది.
Also Read: India vs England: పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్.. మూడో ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే?
బౌలింగ్‌లోనూ స్టోక్స్ ప్రతాపం
బెన్ స్టోక్స్ కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్‌లోనూ తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించాడు. అతను భారత జట్టుపై ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 24 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చి సాయి సుదర్శన్, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అంశుల్ కంబోజ్ వంటి కీలక బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టోక్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు.
స్టోక్స్‌తో పాటు, ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్లు జాక్ క్రాలీ 84 పరుగులు, బెన్ డకెట్ 94 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు పటిష్టమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఆలీ పోప్ 71 పరుగులు, జో రూట్ 150 పరుగులు చేసి భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కష్టపడుతున్నారు. ఇంగ్లాండ్ భారీ ఆధిక్యాన్ని సాధించే దిశగా పయనిస్తోంది.