సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియా జట్టు ఇదే!
మరోవైపు అనుష్క ఈ ఏడాది తొలిసారిగా టీమిండియాలోని ఏదైనా ఫార్మాట్‌కు ఎంపికైంది. ఆమెకు ప్రధానంగా డొమెస్టిక్ క్రికెట్లో అనుభవం ఉంది.
- Author : Gopichand
Date : 24-03-2026 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
BCCI: వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. జట్టు పగ్గాలను హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అప్పగించగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. కాగా ఈ జట్టులో ఇద్దరు కొత్త క్రీడాకారిణులకు చోటు కల్పించారు. జూన్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్‌ను భారత్ ఉపయోగించుకోనుంది.
అనుష్క శర్మ, కాష్వీ గౌతమ్‌లకు తొలిసారి అవకాశం
దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం భారత జట్టులో ఇద్దరు కొత్త ప్లేయర్లు అనుష్క శర్మ, కాష్వీ గౌతమ్‌లను చేర్చారు. వీరిద్దరికీ టీ20 జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి. 22 ఏళ్ల అనుష్క బ్యాటర్ కాగా, కాష్వీ గౌతమ్ మీడియం పేసర్. 22 ఏళ్ల కాష్వీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. ఇప్పటికే టెస్టులు, వన్డేలు ఆడింది.
Also Read: Jeevan Reddy : ఎంతమంది బుజ్జగించిన తగ్గేదేలే అంటున్న జీవన్ రెడ్డి
మరోవైపు అనుష్క ఈ ఏడాది తొలిసారిగా టీమిండియాలోని ఏదైనా ఫార్మాట్‌కు ఎంపికైంది. ఆమెకు ప్రధానంగా డొమెస్టిక్ క్రికెట్లో అనుభవం ఉంది. ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో గుజరాత్ జెయింట్స్ తరపున 7 మ్యాచ్‌ల్లో 177 పరుగులు చేసింది.
వీరికి దక్కని చోటు
జట్టులో షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి వంటి క్రీడాకారిణులకు చోటు కల్పించారు. అయితే వైష్ణవి శర్మ, స్నేహ రాణా, జి. కమలిని, అమన్‌జ్యోత్ కౌర్‌లను జట్టు నుంచి తప్పించారు. కమలిని స్థానంలో ఉమా ఛెత్రికి అవకాశం ఇచ్చారు. స్పిన్ విభాగం బాధ్యతలను దీప్తి శర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్ చూసుకోనున్నారు. ఇటీవల భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడ వన్డే సిరీస్‌లో ఓడిపోయినప్పటికీ.. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
భారత్ vs దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్ షెడ్యూల్
భారత జట్టు ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 27 వరకు దక్షిణాఫ్రికా పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లు మూడు నగరాల్లో జరగనున్నాయి.
- మొదటి టీ20: ఏప్రిల్ 17, డర్బన్
- రెండవ టీ20: ఏప్రిల్ 19, డర్బన్
- మూడవ టీ20: ఏప్రిల్ 22, జోహన్నెస్‌బర్గ్
- నాల్గవ టీ20: ఏప్రిల్ 25, జోహన్నెస్‌బర్గ్
- ఐదవ టీ20: ఏప్రిల్ 27, బెనోని
దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టు
- హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కాష్వీ గౌతమ్, భారతి ఫుల్మాలి, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), అనుష్క శర్మ.