విభేదాలు పక్కన పెట్టేసిన కోహ్లీ, రోహిత్
అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగిన తొలి వన్డేలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
- By Hashtag U Published Date - 10:38 AM, Mon - 7 February 22

అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగిన తొలి వన్డేలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌తో టీమిండియాకు పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా రోహిత్‌శర్మ తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టాడు. 4 ఏళ్ల పాటు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్‌ను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంతో.. ఇద్దరు ఆటగాళ్ల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రోహిత్ సారథ్యంలో కోహ్లీ ఎలా ఆడతాడో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రోహిత్‌తో విభేదాలున్నట్టు వచ్చిన వార్తలపై కోహ్లీ పలుమార్లు ఖండించినా.. వాటికి అడ్డుకట్ట పడలేదు. అయితే అహ్మదాబాద్ వన్డేలో మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. వివాదాలు లేవన్న విధంగా సరదాగా కలిసిపోయారు. ఆ వార్తలే నిజం కాదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
రోహిత్ శర్మ స్థాయి పెరగడం వల్ల కోహ్లి ఇబ్బంది పడతాడన్న అభిప్రాయం వినిపించినా. మ్యాచ్ సమయంలో అలాంటిదేమీ కనిపించలేదు. కోహ్లీ పలు సార్లు రోహిత్‌కు సలహాలు, సూచనలు ఇస్తూ ఉత్సాహపరిచాడు. రోహిత్‌ను ఫీల్డింగ్ చేయమని సలహా కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ రివ్యూ తీసుకున్నప్పుడు, ఈ సమయంలో కూడా కోహ్లీ తన అభిప్రాయాన్ని చెప్పడం కనిపించింది. యుజ్వేంద్ర చాహల్ పొలార్డ్‌ను బౌల్డ్ చేసిన వెంటనే, ఇద్దరూ కలిసి సంబరాలు చేసుకోవడం కనిపించింది. ఈ మ్యాచ్‌లో చాహల్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. 22వ ఓవర్లో విరాట్ కోహ్లి సూచన మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్ఎస్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా జరిగిన ఆసక్తికర సన్నివేశాలతో రోహిత్,విరాట్ మధ్య ఎటువంటి విభేదాలూ లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ గతంలో అలాంటివి జరిగినా… ఇప్పుడు జట్టు ప్రయోజనాల కోసం అవన్నీ మరిచిపోయారని పలువురు విశ్లేషిస్తున్నారు. చాలా మంది చెప్పినట్టు ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదన్న మాటను నిజం చేస్తూ జట్టు విజయం కోసం కలిసే పనిచేస్తున్నట్టు కనిపించింది. ఏదైతేనేం విరాట్-రోహిత్ మధ్య ఉత్సాహమైన కెమిస్ట్రీ భారత క్రికెట్ వర్గాలకు సంతోషాన్నిచ్చింది.