Young India Skills University: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 కోర్సులకు నోటిఫికేషన్ విడుదల!
రాష్ట్రంలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది.
- Author : Gopichand
Date : 09-01-2025 - 7:03 IST
Published By : Hashtagu Telugu Desk
Young India Skills University: ప్రైవేటు రంగంలో తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని (Young India Skills University) ప్రారంభించింది. రాష్ట్రంలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది.
ప్రాధాన్య రంగాల్లో ఫార్మా, కన్‌స్ట్రక్షన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ తదితరాలున్నాయి. సంబంధిత రంగంలో పేరొందిన కంపెనీల భాగస్వామ్యంతో కోర్సులను రూపొందించి యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు.. అదే కంపెనీలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. తాజాగా ‘యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ’ కిమ్స్, ఏఐజీ ఆసుపత్రులు, టీ- వర్క్స్ భాగస్వామ్యంతో 3 కోర్సులకు నోటిఫికేషన్లను జారీ చేసింది. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోర్సులకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు నిరుద్యోగులు తరచూ www.yisu.in వెబ్ సైట్ లో చూడాలని యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Bhu Bharati: ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు.. “భూ భారతి”కి గవర్నర్ ఆమోదం!
1. ఏఐజీ హాస్పిటల్స్ ఎండోస్కోపీ టెక్నీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రాం
వ్యవధి: 6 నెలలు
అర్హులు; ఇంటర్ (బైపీసీ)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయసు: 25 ఏళ్లలోపు
శిక్షణ: ఎండోస్కోపీ ఆపరేషన్స్ పై క్లాస్ రూం, ప్రాక్టికల్ ట్రైనింగ్
ఫీజు: రూ.10వేలు
ఉపాధి అవకాశాలు; ఏఐజీ, ఇతర ఆసుపత్రుల్లో ప్లేస్ మెంట్
2. టీ వర్క్స్ ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం
వ్యవధి: 2 నెలలు
అర్హత: పదో తరగతిఉత్తీర్ణత
వయసు: 18- 25 ఏళ్లలోపు
శిక్షణ; డిజైన్ థింకింగ్, క్యాడ్/క్యామ్ పై అవగాహన కల్పించడం, 3డీ ప్రింటింగ్, వెల్డింగ్, సీఎన్సీ మెషినింగ్, అడ్వాన్స్ డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ప్యాకేజింగ్, వుడ్ , లేజర్ కటింగ్ తదితర అంశాలపై శిక్షణ
ఫీజు: రూ.3వేలు
ఉపాధి అవకాశాలు; జూనియర్ ప్రోటో టైపింగ్ టెక్నీషిన్ గా అవకాశం (జీతం రూ.15వేల నుంచి రూ.25వేల వరకు)
3. మెడికల్ కోడింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రాం
వ్యవధి: 55 రోజులు (45 రోజులు- మెడికల్ కోడింగ్, 10 రోజులు- సాఫ్ట్ స్కిల్స్ పై శిక్షణ)
అర్హులు: బీఎస్సీ (లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత
వయసు: 18-25 ఏళ్లలోపు
శిక్షణ: మాస్టర్ మెడికల్ టెర్మినాలజీ, కోడింగ్ సిస్టమ్స్ పై శిక్షణ
ఫీజు: రూ.18వేలు
ఉపాధి అవకాశాలు; మెడికల్ కోడింగ్ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ మెడికల్ కోడర్