Bhu Bharati: ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు.. “భూ భారతి”కి గవర్నర్ ఆమోదం!
గవర్నర్ ఆమోదించిన భూ భారతి బిల్లు కాపీని గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంత్రికి అందజేశారు.
- By Gopichand Published Date - 06:50 PM, Thu - 9 January 25

Bhu Bharati: చారిత్రాత్మకమైన “భూ భారతి” (Bhu Bharati) చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించిన నేపథ్యంలో వీలైనంత త్వరలో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజానీకానికి మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని మంత్రి అన్నారు.
మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని, ఈ చట్టంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.
Also Read: My Ticket App: టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే.. ”మీ టికెట్” యాప్ ప్రారంభం!
గవర్నర్ ఆమోదించిన భూ భారతి బిల్లు కాపీని గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ చట్టం-2020 వల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కోన్నారు. భూ సమస్యలేని గ్రామం తెలంగాణలో లేదు. గత ప్రభుత్వం తమ వ్యక్తిగత స్వార్ధం కోసం ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి మా ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టింది. గ్రామాలలో రెవెన్యూ పాలనను చూడడానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని ఇందుకు సంబంధించిన కసరత్తు కొలిక్కివచ్చింది.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ విభాగం పనిచేయాలి. రెవెన్యూ వ్యవస్దను ప్రజలకు చేరువ చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఆకాంక్ష. ప్రజాపాలనలో ప్రజలు కేంద్రబిందువుగా మా ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సామన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ శాఖలో అధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేయాలి అని మంత్రి అన్నారు.