అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!
యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరంలో విస్తరించిన ఈ హిమపాతం, మేరీల్యాండ్ నుంచి మైనే వరకు వ్యాపించి కోట్లాది మందిని ఇళ్లకే పరిమితం చేసింది. వాతావరణ నిపుణుల ప్రకారం ఇది గత దశాబ్దంలో నమోదైన అత్యంత తీవ్రమైన శీతాకాల తుపాను. ఈ ప్రభావాన్ని “బాంబ్ సైక్లోన్”గా అభివర్ణిస్తున్నారు.
- Author : Latha Suma
Date : 24-02-2026 - 10:01 IST
Published By : Hashtagu Telugu Desk
Bomb Cyclone : అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని భారీ మంచు తుపాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరంలో విస్తరించిన ఈ హిమపాతం, మేరీల్యాండ్ నుంచి మైనే వరకు వ్యాపించి కోట్లాది మందిని ఇళ్లకే పరిమితం చేసింది. వాతావరణ నిపుణుల ప్రకారం ఇది గత దశాబ్దంలో నమోదైన అత్యంత తీవ్రమైన శీతాకాల తుపాను. ఈ ప్రభావాన్ని “బాంబ్ సైక్లోన్”గా అభివర్ణిస్తున్నారు. ‘బాంబ్ సైక్లోన్’ అనేది సాధారణ మంచు తుపాను కంటే భిన్నం. తుపాను కేంద్ర భాగంలో వాతావరణ పీడనం 24 గంటల్లో వేగంగా పడిపోవడం వల్ల ఇది ఉధృతరూపం దాల్చుతుంది. పీడనంలో ఈ హఠాత్పరిణామం కారణంగా గాలుల వేగం పెరిగి, భారీ హిమపాతం సంభవిస్తుంది. ప్రస్తుతం నమోదైన పరిస్థితులు వాతావరణ శాస్త్రజ్ఞులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో స్థంభించిన జనజీవనం
సోమవారం ప్రారంభమైన ఈ తుపాను న్యూయార్క్ నగరం, బోస్టన్, ఫిలడెల్ఫియా వంటి ప్రధాన నగరాల్లో సాధారణ జీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. పలు ప్రాంతాల్లో రెండు అడుగులకు (సుమారు 60 సెం.మీ.) పైగా మంచు పేరుకుపోవడంతో పాత రికార్డులు బద్దలయ్యాయి. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో గత ఆరేళ్లలో తొలిసారిగా పాఠశాలలకు పూర్తిస్థాయి సెలవు ప్రకటించడం పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు ప్రజలను అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరించారు. గాలుల వేగం గంటకు 83 మైళ్ల (సుమారు 133 కి.మీ.) వరకు నమోదైంది. ఈ తీవ్ర గాలులతో పాటు కురిసిన మంచు కారణంగా రహదారులు మూసుకుపోయాయి. అత్యవసర సేవలు మాత్రమే పరిమితంగా కొనసాగుతున్నాయి.
కుప్పకూలిన రవాణా వ్యవస్థ
తీవ్ర వాతావరణ ప్రభావంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్ విమానాశ్రయాల్లో వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. మొత్తం మీద 5,600కు పైగా విమానాలు నిలిచిపోయాయి. రోడ్ ఐలాండ్‌లోని విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు నగరాల్లో బస్సులు, రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేకపోవడంతో చలిని తట్టుకోవడం కష్టంగా మారింది. మంచు తుఫాను ప్రభావం సెంట్రల్ పార్క్‌లో స్పష్టంగా కనిపించింది. అక్కడ 19 అంగుళాల మేర మంచు నమోదైంది. రోడ్లు నిర్మానుష్యంగా మారడంతో కొందరు పౌరులు స్కీయింగ్ చేస్తూ కనిపించగా టైమ్స్ స్క్వేర్ వద్ద కొంతమంది పర్యాటకులు మంచులో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. అలాగే కనెక్టికట్‌లోని చారిత్రక నౌకలపై పేరుకున్న మంచును తొలగించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రస్తుతం తుపాను ఉత్తర దిశగా కదులుతున్నప్పటికీ ఈ వారం చివర్‌లొ మరో మంచు తుపాను సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.