వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!
గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజుల పని కల్పించడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. గ్రామాల్లో నివసించే కూలీలు, రైతులు,పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
- Author : Gopichand
Date : 21-12-2025 - 7:42 IST
Published By : Hashtagu Telugu Desk
VB-G RAM G: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్’ (VB-G RAM-G) బిల్లు 2025కు ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. 20 ఏళ్ల నాటి ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో ఈ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము VB-G RAM-G బిల్లుపై సంతకం చేయడంతో ఇది చట్టరూపం దాల్చింది. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో గ్రామీణాభివృద్ధికి కొత్త రూపునిచ్చేందుకు ఈ పథకాన్ని తెచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ కొత్త చట్టం ప్రకారం.. గ్రామీణ కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో లభించే చట్టబద్ధమైన పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చారిత్రక నిర్ణయమని ప్రభుత్వం అభివర్ణించింది.
Also Read: బ్రేకింగ్.. భారత్‌పై పాక్ ఘనవిజయం!
బిల్లుపై విపక్షాల నిరసన
ఈ బిల్లుపై పార్లమెంటులో అర్థరాత్రి వరకు సుదీర్ఘ చర్చ జరిగింది. ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ కొత్త పేరును తెచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. పాత పథకంలో కేవలం 100 రోజులు మాత్రమే పని ఉండేదని, కొత్త చట్టం ద్వారా దానిని 125 రోజులకు పెంచుతున్నామని కేంద్రం వివరించింది. తీవ్ర వాదోపవాదాల నడుమ ఈ బిల్లు పార్లమెంటులో ధ్వని ఓటుతో ఆమోదం పొందింది. దీనికి నిరసనగా విపక్షాలు పార్లమెంటు వెలుపల రాత్రంతా ఆందోళన చేపట్టాయి.
VB-G RAM-G చట్టం ఎందుకు ప్రత్యేకం?
గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజుల పని కల్పించడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. గ్రామాల్లో నివసించే కూలీలు, రైతులు,పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీని మరింత పటిష్టం చేయడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.