Women & Kids Park : తెలంగాణలో తొలి మహిళా, పిల్లల పార్కుఇదే..!
- By Prasad Published Date - 06:49 AM, Tue - 7 June 22

తెలంగాణలో మహిళలు, పిల్లల కోసం తొలి పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ (కెపిహెచ్‌బి)-ఫేజ్ 3లో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించిన రాష్ట్రంలోని మొట్టమొదటి థీమ్ పార్క్ ప్రారంభమైంది. అనేక వినోద కార్యక్రమాలను అందించే పార్కులో మహిళలు, పిల్లలు 10 సంవత్సరాలలోపు వారిని మాత్రమే అనుమతించనున్నారు. పిల్లల కోసం ఆట స్థలాలు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్‌లు, యోగా ప్రాంతం, కిట్టీ పార్టీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చిన్న వ్యాపారాలు నిర్వహించే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రదర్శనలు నిర్వహించడానికి తాము ఒక ప్రాంతాన్ని కూడా కేటాయించామని జీహెచ్ఎమ్‌సీ అధికారులు తెలిపారు.
స్వయం సహాయక సంఘాల మహిళల కోసం వర్క్‌షాప్‌లు, శిక్షణా శిబిరాలు నిర్వహించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. మునిసిపల్ బాడీ వారికి ఎంబ్రాయిడరీ, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర ఉత్పత్తుల తయారీలో కూడా శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును కెపిహెచ్‌బి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) రూ. 1.7 కోట్లతో అభివృద్ధి చేశాయి. ఈ రెండు సంస్థలు పార్క్ అభివృద్ధికి నిధులు ఖర్చు చేశాయి. హౌసింగ్ బోర్డు భూమిలో పార్కును అభివృద్ధి చేశారు.. పిల్లల ఆట స్థలం, ఓపెన్ జిమ్‌ను GHMC అభివృద్ధి చేయగా, వాకింగ్ ట్రాక్ మరియు కాంపౌండ్ వాల్‌ను హౌసింగ్ బోర్డు నిర్మించిందని జీహెచ్ఎమ్‌సీ అధికారులు తెలిపారు.