SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?
మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
- By Latha Suma Published Date - 07:44 PM, Fri - 28 February 25

SLBC Tunnel : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ కథ విషాదాంతం అయినట్లు సమాచారం. టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందినట్లు రెస్క్యూ టీమ్ శుక్రవారం గుర్తించింది. 3 మీటర్ల లోతులో మృతదేహాలు ఉన్నాయని, అత్యాధునిక పరికరాలతో రెస్క్యూ టీమ్ గుర్తించినట్లు తెలుస్తుంది. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
Read Also: TNPCB : ఫౌండేషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు : సుప్రీంకోర్టు
మట్టి లో కూరుకుపోయిన 5 మృతదేహాలు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా గుర్తించారు. ఈ 5 మృతదేహాలను వెలికి తీయడానికి మరింత సమయం పడుతుందని, కొన్ని మీటర్ల లోతు మట్టిలో మృతదేహాలు కూరుకు పోయినట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురి మృతదేహాల కోసం అధికారులు గాలిస్తున్నారు. NGRI టీమ్, GPR సాయంతో టన్నెల్‌లో ఐదు అనుమానాస్పద ప్రదేశాలను గుర్తించింది. ఈ ప్రాంతాల్లో శరీర నిఘా కోసం మార్కింగ్ నిర్వహించారు. రక్షణ బృందాలు ఆచూకీని కనుగొని, బాధితుల మృతదేహాలను వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
కాగా, ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 14వ కిలో మీటర్ పాయింట్ వద్ద ఈ నెల 22న ఉదయం 8.20 గంటలకు ప్రమాదం సంభవించింది. ఉదయం పనులు చేస్తుండగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కొన్ని మీటర్ల మేర కూలిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో టీబీఎం ముందు భాగంలో పనులు చేస్తున్న ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు అందులో చిక్కుకుపోయారు. 42 మంది బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగా, 8 మంది మాత్రం లోపల చిక్కుకున్నారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ టీమ్స్, సింగరేణి టీమ్స్, పోలీసులు, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్ లు సైతం ఎంత ప్రయత్నించినా లోపల చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడలేకపోయాయి.
మరోవైపు ఈ ఘటనపై నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ..టన్నెల్ లో చిక్కుకున్న వారిపై మీడియాలో ప్రసారమవుతున్న కథనాలు తప్పుడు ప్రచారమని ఆయన కొట్టిపడేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవం అన్నారు. తప్పుడు వార్తలు ఎవరూ నమ్మొద్దు అన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఏదైనా సమాచారం ఉంటే.. మేం అధికారికంగా వెల్లడిస్తాం అని తెలిపారు.
Read Also: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. 57 మంది కూలీలు గల్లంతు