Mumbai Rains: వర్షాలతో ముంబై అతలాకుతలం
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల తర్వాత బుధవారం ఉదయం ముంబైలో ఎడతెరిపిలేని వర్షం నమోదైంది.
- Author : Balu J
Date : 06-07-2022 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల తర్వాత బుధవారం ఉదయం ముంబైలో ఎడతెరిపిలేని వర్షం నమోదైంది. నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలనుద్దేశించి ఓ వ్యక్తి వినూత్నంగా (మాకు ఇప్పుడు ప్రయాణించడానికి కారుకు బదులుగా పడవ అవసరం) ట్వీట్ చేయడం ముంబై లో వర్షభావ పరిస్తితులు ఏవిధంగా ఉన్నాయో తెలుస్తోంది. లోకల్ రైళ్లు సాధారణంగా నడుస్తున్నాయని సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. అయితే కొంతమంది ప్రయాణికులు సబర్బన్ సర్వీసులు కొద్దిగా ఆలస్యంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.
ముంబైలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. శివారు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో సగటున 107 మిమీ వర్షపాతం నమోదైంది. హింద్‌మాత వంటి కొన్ని లోతట్టు ప్రాంతాలు, దాదర్ మరియు సియోన్‌లోని గాంధీ మార్కెట్, సియోన్‌లోని రోడ్డు నంబర్ 24తో సహా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై, పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కారణంగా రైల్వే ట్రాక్‌లతో సహా అనేక ప్రదేశాలలో నీరు నిలిచిపోయింది. ఇది రైలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు.