పంజాబ్‌లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య
డిసెంబర్ 15, 2025 సాయంత్రం 6:05 గంటలకు, 30 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్‌ను బుల్లెట్ గాయాలతో ఫోర్టిస్ హాస్పిటల్ మొహాలీకి తీసుకురావడం జరిగింది.
- Author : Gopichand
Date : 15-12-2025 - 10:18 IST
Published By : Hashtagu Telugu Desk
Kabaddi: పంజాబ్‌లోని మొహాలీలోని సోహానాలో జరుగుతున్న కబడ్డీ (Kabaddi) టోర్నమెంట్‌లో గుర్తు తెలియని బోలెరో వాహనంలో వచ్చిన దుండగులు కబడ్డీ క్రీడాకారుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్ అలియాస్ రాణా బాలాచౌరియాపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, ప్రారంభ చికిత్స అందించిన కొద్దిసేపటికే వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. రాణా హత్యకు దవిందర్ బాంబిహా గ్యాంగ్ బాధ్యత వహించింది.
గోపి ఘనశ్యాంపురియా అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇలా పోస్ట్ చేయబడింది. రాణా బాలాచౌరియా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు పనిచేసేవాడు. సిద్ధూ మూసేవాలా హంతకులకు ఆశ్రయం కల్పించాడు. అందుకే అతన్ని చంపి, మూసేవాలా హత్యకు ప్రతీకారం తీర్చుకున్నామని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?
అనంతరం ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో ఇలా తెలిపింది. డిసెంబర్ 15, 2025 సాయంత్రం 6:05 గంటలకు, 30 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్‌ను బుల్లెట్ గాయాలతో ఫోర్టిస్ హాస్పిటల్ మొహాలీకి తీసుకురావడం జరిగింది. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ అతను మరణించినట్లు ప్రకటించడం మాకు చాలా బాధగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అని తెలిపింది.
మొహాలీ ఎస్ఎస్‌పీ హర్మన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. హత్యకు గురైన కబడ్డీ క్రీడాకారుడు నవాన్‌షహర్‌కు చెందిన వారని తెలిపారు. సమాచారం ప్రకారం.. మొహాలీలోని ఒక ప్రైవేట్ పాఠశాల ముందు ఉన్న ఖాళీ మైదానంలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతోంది. దీనికి రాణా బాలాచౌరియా కూడా హాజరయ్యారు. వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఒక కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రాణా బాలాచౌరియాపై కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపిన తర్వాత బాలాచౌరియాను తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆసుపత్రిలో చేర్చారు. మొహాలీ నగరం నడిబొడ్డున ఈ సంఘటన జరగడం శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.