Karimnagar : మళ్లీ గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
రాత్రి 12గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
- By Latha Suma Published Date - 02:16 PM, Tue - 7 January 25

Karimnagar: గత కొన్ని రోజులుగా తెలంగాణలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్‌లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా కరీంనగర్ పట్టణం శర్మ నగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
కాగా, తెలంగాణలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మెస్‌చార్జీలు పెంచి, నాణ్యమైన భోజనం పెడుతున్నాక కూడా విద్యార్థులు ఎందుకు దవాఖానల పాలవుతున్నారో ప్రభుత్వం చెప్పాలని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో మృత్యు కుహారాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్‌వాడీలు, ఆస్పత్రుల్లో ఆహార నాణ్యతను టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి, బాధ్యులను గుర్తించనుంది ఈ టాస్క్‌ఫోర్స్. ఇక, పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్, ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Also: Nampally : బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ