Nara Lokesh : వాలంటీర్ల వ్యవస్థపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్
Nara Lokesh : వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే స్పష్టత లేకుండా పోయిందని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వాలంటీర్లపై జీవోను ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు.
- By Kavya Krishna Published Date - 09:29 AM, Mon - 6 January 25

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు వాలంటీర్ల అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. విశాఖపట్నంలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, వాలంటీర్ల వ్యవహారాన్ని ప్రస్తావించిన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. లోకేష్ మాట్లాడుతూ, “పుట్టని పిల్లలకు పేర్లు పెట్టడం ఎలా? అని వ్యాఖ్యానించారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే స్పష్టత లేకుండా పోయిందని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వాలంటీర్లపై జీవోను ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. వాలంటీర్లను ఉద్యోగాల్లో కొనసాగించకపోవడం చట్టానికి విరుద్ధమని పేర్కొన్న ఆయన, అది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో అధికారికంగా పోస్టులు లేకుండానే వాలంటీర్లకు డబ్బులు చెల్లించడం చట్ట విరుద్ధమని. ఈ సమస్యల కారణంగా ప్రభుత్వానికి ఇప్పుడు లీగల్ సమస్యలు ఎదురవుతున్నాయని లోకేష్ వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రస్తావించిన ఆయన, రాష్ట్ర బడ్జెట్ ప్రతినెలా రూ.4,000 కోట్ల లోటుతో నడుస్తోందని, ఈ పరిస్థితిలో ఉద్యోగులకు జీతాల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కేంద్రం సహాయంతో పరిస్థితులను సమతూకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
Anantha Sriram : హిందూ ధర్మాన్ని అవమానించే సినిమాలను బహిష్కరించాలి : అనంత శ్రీరామ్
ఇక గ్రామ, వార్డు వాలంటీర్లు మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు “తమను విధుల్లోకి తీసుకోవాలని, రూ.10వేలు గౌరవ వేతనం ఇవ్వాలని” డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు కోరుతున్నారు. తమ హక్కులను సాధించుకోవాలని వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా, తమకు తిరిగి ఉద్యోగాలు కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఎన్నికల హామీలను అమలు చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం మాత్రం వాలంటీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తోంది. అధికారిక ప్రకటనలో, గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను కొనసాగించేందుకు స్పష్టమైన జీవో లేకపోవడం వల్ల, తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవడం కుదరదని తెలిపింది. ప్రభుత్వం ప్రకారం, వాలంటీర్లకు స్థానికంగా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వారి విద్యార్హతలకు అనుగుణంగా తగిన శిక్షణ అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది.
గ్రామ, వార్డు వాలంటీర్ల అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వాలంటీర్లు తమ హక్కుల కోసం పోరాడుతుండగా, మరోవైపు ప్రభుత్వం ఆర్థిక లోటు, న్యాయపరమైన సమస్యలను చూపిస్తూ వ్యవస్థను పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో చూడాలి.
Poonam Kaur : త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు.. స్పందించిన MAA ట్రెజరర్ శివబాలాజీ