Hyderabad: కేటీఆర్ ఇదేనా విశ్వనగరం?
పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది
- By Praveen Aluthuru Published Date - 07:37 AM, Thu - 27 July 23

Hyderabad: పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లపై నీళ్లు ప్రవహిస్తుండటంతో విపక్షాలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ ని డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తానని చెప్పి నగర రోడ్లని నదుల్లాగా మార్చారని మండిపడ్డారు తెలంగాణ టిపిసిసి ప్రధాన కార్యదర్శి మల్లు రవి.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చామని గొప్పలు చెప్తున్న కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలు, రోడ్ల పరిస్థితిని చూసి సమాధానం చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటించిన మల్లు రవి మరియు అధికార ప్రతినిధి నర్సారెడ్డి భూపతి రెడ్డి రోడ్ల పరిస్థితిని చూసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చామని గొప్పలు చెప్తున్న కేటీఆర్, అదే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్తున్న స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పరిస్థితిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో దోచుకోవడమే తప్ప ప్రణాళిక బద్దంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు.