Missing Women : పవన్ వ్యాఖ్యలు నిజమేనా?.. ఏపీ, తెలంగాణలో బాలికలు, మహిళలు అదృశ్యంపై గణాంకాలు వెల్లడించిన కేంద్రం..
తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళలు అదృశ్యంపై కేంద్రం గణాంకాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా.
- By News Desk Published Date - 07:02 PM, Wed - 26 July 23

ఇటీవల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన బహిరంగ సభలలో మాట్లాడుతూ ఏపీలో వాలంటీర్లు(AP Volunteers) సేకరించిన డేటాతో మహిళలు అదృశ్యమవుతున్నారని, ఆ డేటాతో కొంతమంది ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయని కూడా అన్నారు పవన్. అయితే దీనిపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వచ్చి వాలంటీర్లు, వైసీపీ నాయకులు(YCP Leaders) పవన్ పై విమర్శలు చేస్తున్నారు. వీటికి ఆధారాలు చూపించాలని అంటున్నారు.
తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళలు అదృశ్యంపై కేంద్రం గణాంకాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా. జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యం అవుతున్న కేసులు ఏటేటా పెరుగుతున్నాయని అన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా తెలిపిన లెక్కల ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్ళలో 72,767 మంది అదృశ్యం అయినట్లు, వీరిలో 15,994 బాలికలు ఉన్నారని, 56,773 మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఏపీలో 2019 నుండి 2021 వరకు మూడు ఏళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యం అయ్యారని తన నివేదికలో వెల్లడించారు. తెలంగాణాలో 2019 నుండి 2021 వరకు మూడేళ్లలో మొత్తం 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యం అయ్యారని తెలిపారు. దీంతో కేంద్రం సమర్పించిన ఈ లెక్కలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారాయి.
ఇక ఏపీలో అయితే పవన్ చెప్పింది నిజమేనా? మహిళల అదృశ్యం జరుగుతున్నట్టు పవన్ కి ఇచ్చిన సమాచారం ఇదేనా అని చర్చ జరుగుతుంది. మరి దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.
Also Read : Polavaram : పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష