400 Deaths – 24 Hours : 24 గంటల్లో 400 మంది హతం.. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ ఎటాక్
400 Deaths - 24 Hours : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరింత తీవ్రమయ్యాయి.
- By Pasha Published Date - 01:43 PM, Mon - 23 October 23

400 Deaths – 24 Hours : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారితో ఇప్పటికే గాజాలోని ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఈ తరుణంలో కొత్తగా గాయాలయ్యే వారికి చికిత్స చేసే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో గాజాలోని ఎన్నో ఆస్పత్రులు నేలమట్టం అయ్యాయి. ఎంతోమంది డాక్టర్లు, వైద్యసేవల సిబ్బంది కూడా చనిపోయారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో క్షతగాత్రులయ్యే వారి జీవితం ప్రశ్నార్ధకంగా మారుతోంది. వైద్య చికిత్సకు తగిన సామగ్రి కూడా గాజాలో అందుబాటులో లేదు. వైద్యుల కొరత కూడా ఉంది. గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 400 మందికిపైగా పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో గత 17 రోజుల వ్యవధిలో చనిపోయిన పాలస్తీనా పౌరుల సంఖ్య 4600 దాటింది.
We’re now on WhatsApp. Click to Join.
గాజాపై దాడులను ఆపాలని చాలా దేశాలు డిమాండ్ చేస్తున్నా.. ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులు చేస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందనే విమర్శ వినిపిస్తోంది. ఇక దాదాపు గత 17 రోజులుగా గాజాలో కరెంటు లేదు. నీటి వసతి లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మురికి నీటిని తాగి అక్కడి ప్రజలు రోజులు వెళ్లదీస్తున్నారు. దాదాపు 15 రోజుల గాజా ముట్టడి తర్వాత ఎట్టకేలకు రెండు రోజుల క్రితం (శనివారం సాయంత్రం) గాజాలోకి మానవతా సాయం వెళ్లేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ అనుమతించింది. అది కూడా చాలాపరిమితంగా మానవతా సాయాన్ని గాజాలోకి పంపింది. మెడికల్ కిట్స్ తో కూడిన ట్రక్కులు వెళ్లేందుకు మాత్రమే ఇజ్రాయెల్ అనుమతించింది. ఆహార సామగ్రి వెళ్లేందుకు ఇజ్రాయెల్ పర్మిషన్ ఇవ్వడం లేదని (400 Deaths – 24 Hours) అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గాజాకు మానవతా సాయం కోసం భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు పంపిన సహాయక సామగ్రి దాదాపు 200కుపైగా ట్రక్కుల్లో ఈజిప్టు-గాజా బార్డర్ కు చేరుకుంది. కానీ ఇప్పటివరకు వాటిలో కేవలం 20 నుంచి 30 ట్రక్కులను మాత్రమే గాజాలోకి ఇజ్రాయెల్ ఆర్మీ అనుమతించింది.