Gold Rate Today: బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. సీన్ రివర్స్..!
- By Vamsi Chowdary Korata Published Date - 12:49 PM, Thu - 13 November 25
అనుకున్నదే జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగ్గా.. అది దేశీయంగా ఇవాళ (నవంబర్ 13) ఉదయం 10 గంటల తర్వాత ప్రభావం చూపింది. ఒక్కసారిగా రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన పడుతున్నారు. ఎంసీఎక్స్‌లోనూ బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ జువెల్లరీల్లో ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ఎంత పలుకుతుందనేది చూద్దాం.
బంగారం ధర 2 రోజులు పెరిగి ఒక్కసారిగా స్వల్పంగా తగ్గిందనుకునేలోపే మరో షాక్ తగిలింది. అనుకున్నట్లుగానే రేట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం గురువారం ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా కనిపించింది. దీంతో రేట్లు మారాయి. బంగారం, వెండి ట్రేడింగ్ జరిగే భారతీయ మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో (MCX) కూడా బంగారం ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా యూఎస్ డాలర్ బలహీనపడటం ఇదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు రావడం.. ఇంకా బాండ్లను కొనుగోలు చేసేందుకు ఫెడ్ ఆసక్తి చూపించడం వంటివి గోల్డ్ ర్యాలీకి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కీలక సాంకేతిక అంశాలు బలంగా ఉండటంతో.. సమీప భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా పెరిగేందుకే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ. 450 కిపైగా పెరిగి రూ. 1,26915 స్థాయిలో ఉంది. ఇంట్రాడేలో రూ. 1,27,271 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఎంసీఎక్స్ సిల్వర్ రేటు 1.70 శాతానికిపైగా (రూ. 2700కుపైగా) పెరిగింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,210 డాలర్లపైన ట్రేడవుతోంది. సిల్వర్ రేటు 54 డాలర్ల మార్కు దాటేసింది.
దేశీయంగా చూస్తే బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. 22 క్యారెట్ల పసిడి ధర హైదరాబాద్‌లో చూస్తే ఒక్కరోజే రూ. 2100 పెరిగింది. దీంతో ప్రస్తుతం తులం రూ. 1,17,150 కి చేరింది. అంతకుముందు రూ. 300 తగ్గింది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 2,290 పెరగడంతో 10 గ్రాములకు రూ. 1,27,800 గా ఉంది. వెండి ధర చూస్తే మళ్లీ ఒక్కరోజులోనే రూ. 9 వేలు పెరిగింది. ఇప్పుడు కిలోకు రూ. 1.82 లక్షలకు చేరింది. గత 4 రోజుల్లో ఇది రూ. 17 వేలు పెరగడం గమనార్హం.
ప్రముఖ జువెల్లరీల్లో బంగారం ధర చూస్తే.. లలితా జువెల్లరీస్, ఖజానా, జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్‌లో గ్రాము బంగారం ధర రూ. 11,715 గా ఉంది. టాటా ప్రొడక్ట్ తనిష్క్‌లో బంగారం ధర మారినట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముపై రూ. 11,545 గా ఉంది. అయితే.. ఇక్కడ రేట్లు ఇలా ఉన్నప్పటికీ.. జువెల్లరీ కొనుగోలు చేసిన తర్వాత అప్పుడు ఇతర మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ పడుతుంది. మేకింగ్ ఛార్జీలు షాపుల్ని బట్టి.. డిజైన్లను బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఇక జీఎస్టీ 3 శాతంగా ఉండగా.. మేకింగ్ ఛార్జీలపై అదనంగా 5 శాతం జీఎస్టీ పడుతుంది.
యూఎస్ కాంగ్రెస్ తాత్కాలిక నిధుల బిల్లును ఆమోదించడంతో 40 రోజులకుపైగా కొనసాగిన షట్‌డౌన్ ముగిసింది. ఈ క్రమంలో డాలర్ ఇండెక్స్ బలహీనపడి 99.50 స్థాయికి చేరింది. డాలర్ బలహీనపడితే బంగారం ధర పెరుగుతుందని చెప్పొచ్చు. ఇటువైపు పెట్టుబడులు పెరగడం ఇందుకు కారణం.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబరులో మరోసారి 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లలో కోత విధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బంగారం ధరలకు మరింత ఊతం లభిస్తుంది.