Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి
- Author : Prasad
Date : 29-05-2026 - 1:08 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సీఐ డ్రైవర్‌గా హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జానీ కరెంట్ షాక్‌కు గురై మృతి చెందారు. బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు తీసుకున్న జానీ తన సొంత ఆటోలో భార్యతో కలిసి బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే ఈదురు గాలులు, అకాల వర్షం కారణంగా రోడ్డుపై భారీగా నీరు నిలిచింది. నీటిలో ఆటో నిలిచిపోవడంతో జానీ తన భార్యను ఆటోలోనే ఉంచి, వాహనాన్ని నెట్టుకుంటూ సమీపంలోని టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లారు.
అయితే అదే సమయంలో బలమైన గాలుల కారణంగా విద్యుత్ తీగ తెగి ఆటో సమీపంలో పడింది. ఈ విషయాన్ని గమనించని జానీ, వెనక్కి కదులుతున్న ఆటోను ముందుకు నెట్టేందుకు ప్రయత్నిస్తూ కిందకు దిగారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కి గురై తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే జానీ మృతి చెందారు. ఆటోలో ఉన్న ఆయన భార్య మాత్రం సురక్షితంగా బయటపడింది. పండగ రోజునే కుటుంబ పెద్దను కోల్పోవడంతో జానీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సహోద్యోగులు, స్థానికులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.