Nagarjuna : షాకిచ్చిన హైడ్రా.. హీరో నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత
హైదరాబాద్ నగరం మాదాపూర్ ఏరియాలోని హీరో నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత పనులను మొదలుపెట్టింది.
- By Pasha Published Date - 09:36 AM, Sat - 24 August 24

Nagarjuna : ఇవాళ ఉదయాన్నే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) విభాగం యాక్టివిటీని మొదలుపెట్టింది. హైదరాబాద్ నగరం మాదాపూర్ ఏరియాలోని హీరో నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత పనులను మొదలుపెట్టింది. భారీ బందోబస్తు మధ్య అధికారులు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. హీరో నాగార్జున తుమ్మకుంట చెరువును ఆక్రమించి మూడున్నర ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటరును నిర్మించారంటూ ఇటీవలే హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఫిర్యాదుదారులు హైడ్రా అధికారులకు అందించినట్లు తెలిసింది.
We’re now on WhatsApp. Click to Join
దీంతో ఇవాళ తెల్లవారుజాము నుంచే అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటరు(Nagarjuna) కూల్చివేత పనులు ప్రారంభించారు. గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాటిని గుర్తించి వెంటనే తొలగిస్తున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంతో కూల్చివేత ఆగిపోయింది. జన్వాడ ఫాంహౌస్ తనది కాదని.. లీజుకు తీసుకున్నానని నిజంగా అక్రమ కట్టడమైతే తానే కూల్చేయిస్తానని కేటీఆర్ వెల్లడించారు.హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతలు ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌లకు చెందిన ఫామ్‌హౌస్‌లను కూడా కూల్చేయాలని డిమాండ్ చేశారు.
Also Read :Maharashtra : ‘మహా’ విషాదం.. నదిలో పడిన బస్సు.. 41 మంది మృతి
‘హైడ్రా’ను జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం మూలాలను వాడుకొని తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. జీవో 99 ద్వారా ఒక స్వయంప్రతిపత్తి సంస్థగా హైడ్రాను ఏర్పాటు చేశారు. దీనికి విస్తృత అధికారాలను కల్పించారు.‘అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆగవు, వెనక్కి తగ్గేది లేదు, ఎవరున్నా వదిలేది లేదు’ అని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధీనంలో పనిచేసే హైడ్రాకు రాష్ట్రంలోని వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుచ్ఛక్తి, పోలీస్ విభాగాలు సహాయ సహకారాలు అందిస్తాయి. ఆక్రమణదారును ఈ విభాగాలన్నీ కలిసి కదలకుండా చేస్తాయి. హైడ్రా ప్రధానంగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి కట్టిన భవంతులు, చెరువులు కబ్జా చేసి కట్టిన భవంతులు, అక్రమ వెంచర్లలో కట్టిన నిర్మాణాలను టార్గెట్ చేస్తోంది.